దేశవ్యాప్తంగా కరోనా దెబ్బకు ఓ వైపు ప్రజలు బెంబేలెత్తిపోతుంటే.. మరో వైపు ఆయా రాష్ట్రాల్లో ఇప్పటికే స్కూళ్లు, కాలేజీలు, సినిమా హాల్స్‌ను మూసివేశారు. కేరళలో మార్చి 31వ తేదీ వరకు స్కూల్స్, కాలేజీలు, సినిమా థియేటర్లను మూసి వేయగా ఇప్పుడు అదే బాటలో జమ్మూ కాశ్మీర్ నిర్ణయం తీసుకుంది. అక్కడ కూడా మార్చి 31వ తేదీ వరకు ఆయా ప్రదేశాలను మూసి వేస్తున్నట్లు ప్రకటించింది.
జమ్మూ కాశ్మీర్‌లో మార్చి 31వ తేదీ వరకు అన్ని ప్రభుత్వ, ప్రైవేటు స్కూళ్లు, కాలేజీలతోపాటు సినిమా హాళ్లు, యూనివర్సిటీలను మూసి వేస్తున్నట్లు అక్కడి పరిపాలన విభాగం ప్రకటించింది. ఈ మేరకు అక్కడి డిపార్ట్‌మెంట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అండ్ పబ్లిక్ రిలేషన్స్ (డీఐపీఆర్) విభాగం ప్రకటించింది. అలాగే ప్రజలు వీలైనంత వరకు బయట తిరగడం మానేయాలని అధికారులు సూచిస్తున్నారు.
జమ్మూ కాశ్మీర్ లో ఇప్పటికే ఓ మహిళకు కరోనా సోకగా ముందు జాగ్రత్త చర్యగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు జమ్మూ కాశ్మీర్ అధికారులు తెలిపారు. అందులో భాగంగానే మార్చి 31వ తేదీ వరకు స్కూళ్లు, కాలేజీలు, యూనివర్సిటీలకు సెలవులు ఇచ్చామని, అయితే బోర్డు, కాంపిటీటివ్ పరీక్షలు మాత్రం యథావిధిగా జరుగుతాయని, కానీ ప్రజలు మాత్రం అనవసరంగా బయటకు రావద్దని, వీలైనంత వరకు ప్రజా రవాణాను ఆశ్రయించకూడదని సూచిస్తున్నారు.