రాష్ట్రంలో పీజీ వైద్య విద్యను ఆశిస్తున్న వైద్య విద్యార్థులందరూ దాదాపు పూర్తిగా రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. డాక్టర్ ఎన్టీయార్ వైద్య విశ్వ విద్యాలయం జారీ చేసిన నోటిఫికేషన్ మేరకు రిజిస్ట్రేషన్ ప్రక్రియ గత నెల 27న మొదలయ్యింది. నేటి మధ్యాహ్నం వరకు 8,645 మంది పీజీ వైద్య విద్యలో ప్రవేశం కొరకు రిజిస్ట్రేషన్ చేసుకున్నట్లు వైద్య విశ్వవిద్యాలయం అధికారులు తెలిపారు. ఈ ఏడాది జరిగిన పీజీ నీట్ పరీక్షలో దాదాపు 9 వేల మంది పీజీ వైద్య విద్య కొరకు అర్హత సాధించినట్లు సమాచారం.
ఎన్టీయార్ వైద్య విశ్వ విద్యాలయం గత నెల 27 నుండి రిజిస్ట్రేషన్ ప్రారంభించి ఈ నెల 4 వరకు అప్లికేషన్లు కోరింది. గతానుభవంతో వైద్య విద్యార్థులకు ఎటువంటి ఇబ్బందులు కలగకూడదన్న ఉద్దేశంతో ఈనెల 5,6, 7 తేదీల్లో లేటు ఫీజు చెల్లించి రిజిస్ట్రేషన్ చేసుకునే అవకాశాన్ని కల్పించారు. రిజిస్ట్రేషన్ షెడ్యూలుకు వచ్చిన మంచి స్పందనను నిర్ధారిస్తూ ఈనెల 5,6 తేదీల్లో కేవలం 16 మంది విద్యార్థులు మాత్రమే లేటు ఫీజుతో రిజిస్ట్రేషన్ చేసుకున్నట్లు వైద్య విశ్వవిద్యాలయం అధికారులు వెల్లడించారు. ఈ నేపథ్యంలో లేటు ఫీజు రిజిస్ట్రేషన్‌కు బదులుగా 5,6,7 తేదీల్లో జరిగే రిజిస్ట్రేషన్‌ను సాధారణ రిజిస్ట్రేషన్ గా పరిగణిస్తున్నట్లు ఈ రోజు విడుదల చేసిన నోటిఫికేషన్ ద్వారా వైద్య విశ్వవిద్యాలయం తెలిపింది. దీంతో సాధారణ రిజిస్ట్రేషన్‌ను మూడు రోజుల పాటు పొడిగించినట్లయ్యింది. అయితే తమిళనాడు, మహారాష్ట్ర , ఉత్తర ప్రదేశ్ హిమాచల్ ప్రదేశ్, జమ్మూ మరియు కాశ్మీర్, పుదుచ్చేరి వంటి పలు రాష్ట్రాల్లో ఇప్పటికే రిజిస్ట్రేషన్ ప్రక్రియ ముగిసినట్లు అధికారులు వెల్లడించారు.