‘జగనన్న కాలనీ’ల్లో జనసేన..నాగబాబు తగులుకున్నారు..!

-

రాష్ట్రంలో ప్రతి పేదవాడికి సొంత ఇల్లు కల నెరవేరుస్తామని చెప్పి…జగన్ అర్హులైన వారికి ఇళ్ల స్థలాలు ఉచితంగా ఇచ్చిన విషయం తెలిసిందే. అందులో ఇల్లు నిర్మించుకోవడం కోసం కేంద్ర సాయం లక్షా 50 వేలు ఇస్తుంది. ఇటు ఉపాధి హామీ కింద రూ.30 వేలు ఇస్తున్నారు. మొత్తం లక్షా 80 వేలు ఇస్తున్నారు. అయితే ఇళ్ల స్థలాల్లో, ఇళ్ల నిర్మాణాల్లో అక్రమాలు జరిగాయని ప్రతిపక్ష టీడీపీ ఎప్పటినుంచో ఆరోపిస్తుంది.

అలాగే నివాసయోగ్యం కాని భూములు, కొండలు, శ్మశానలు, అడవుల్లో, చెరువుల్లో స్థలాలు ఇచ్చారని పోరాటాలు చేశారు. కానీ ఈ అంశాలు ఎక్కువగా ప్రజల్లోకి వెళ్ళినట్లు లేవు. ఏదో కొంతమేర ప్రజలకు చేరుకుంది. కాని తాజాగా పవన్ ఆధ్వర్యంలో జనసేన వీటిపై పోరాటం మొదలుపెట్టింది. విజయనగరం జిల్లాలోని జగనన్న కాలనీల్లో పవన్ పర్యటించిన విషయం తెలిసిందే. జనసేన నేతలు రాష్ట్ర వ్యాప్తంగా కాలనీల్లో పర్యటిస్తున్నారు.

ఈ కాలనీల్లో దాదాపు రూ.15 వేల కోట్ల అవినీతికి పాల్పడ్డారని జనసేన నేతలు ఆరోపిస్తున్నారు. పేదలకు మంచి చేయాలని చూస్తుంటే జనసేన  వాళ్ళు అడ్డుకుంటున్నారని వైసీపీ నేతలు విమర్శిస్తున్నారు. ఇదే క్రమంలో వీటిపై నాగబాబు మాట్లాడుతూ..వైసీపీపై విరుచుకుపడ్డారు. జగనన్న కాలనీల పేరుతో “జే-గ్యాంగ్‌” దోచుకున్న దోపిడీ మొత్తం రూ.15,191 కోట్లు వివరాలు ప్రజల ముందు ఉంచుతున్నామన్నారు.

ఇళ్లస్టలాల కొనుగోలులో అక్రమాలు చేసి రూ.4 వేల కోట్లు, అంటే ఉదాహరణకు ఎకరం భూమి 10 లక్షలు ఉంటే…దాన్ని 40-50 లక్షలుగా చూపించి..ప్రభుత్వం నుంచి డబ్బులు తీసుకుని రైతుకు 10 లక్షలు ఇచ్చి, మిగిలినవి వైసీపీ నేతలు కొట్టేశారని అంటున్నారు. అలాగే జగనన్న కాలనీల లెవలింగ్‌, చదును పేరుతో రూ.2,631 కోట్లు దోచుకున్నారని ఆరోపించారు. జగనన్న కాలనీల్లో ఇసుక సరఫరా పేరుతో రూ. 3,100 కోట్లు, సిమెంటు పేరుతో రూ.2,100 కోట్లు, ఇనుము పేరుతో రూ.1860 కోట్లు.. జగనన్న కాలనీల పక్కన అధికార పార్టీ నేతలు రియల్‌ ఎస్టేట్‌ పేరుతో రూ.1500 కోట్లు దోచుకున్నట్లు చెప్పారు.

ఇలా రకరకాలుగా కాలనీల్లో అవినీతి చేశారని అంటున్నారు..అయితే ఈ అక్రమాలపై నిజనిజాలు ఏంటి అనేది ప్రజలకు తెలుసని చెబుతున్నారు. ఇక ఇళ్ల స్థలాలని ఎక్కువ శాతం వైసీపీ వాళ్ళకే ఇవ్వడం చేశారు. ఇక సెంటు, సెంటున్నర స్థలాల్లో ఎంత ఇల్లు పడుతుందో చెప్పాల్సిన పని లేదు. లక్షా 80 వేలు నిర్మాణానికి చాలవు.

ఇక గత టి‌డి‌పి ప్రభుత్వం నిర్మించిన టిడ్కో ఇళ్లకు రంగులు వేసి, అప్పటి లబ్దిదారులుని మార్చి, ఇప్పుడు వైసీపీ వాళ్ళకు ఇచ్చుకుంటున్నారనే విమర్శలు ఉన్నాయి. ఇలా ఇళ్లకు సంబంధించి భారీ స్థాయిలో అవినీతి చేశారని ఆరోపణలు ఉన్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news