మూడు రాజధానుల అంశంపై పొలిటికల్ అఫైర్స్ కమిటీ ప్రతినిధులతో రేపు జనసేనాని పవన్ అత్యవసర సమావేశం కానున్నారు. భవిష్యత్ కార్యాచరణ, 3 రాజధానులపై టెలీకాన్ఫరెన్స్‌లో నేతల అభిప్రాయాలు తీసుకోనున్నారు. రాజధాని రైతులకు జనసేన తరఫున ఎలా అండగా ఉండాలన్న దానిపై చర్చ జరగనుంది. భవిష్యత్ కార్యాచరణపై జనసేన రేపు అధికారిక ప్రకటన చేసే అవకాశం ఉంది.
ఇప్పటికే రాజధాని విషయంలో పవన్ కళ్యాణ్ స్పందించారు.మూడు రాజధానులపై నిర్ణయానికి ఇది సరైన సమయం కాదని పవన్ అన్నారు. రాష్ట్రంలో రోజుకు పదివేల కొవిడ్ కేసులు నమోదు అవుతున్నాయని, దీంతో ప్రజలు ప్రాణాలు అరచేత పట్టుకుని భయాందోళనతో బతుకుతున్నారని చెప్పారు. ఈ పరిస్థితుల్లో పాలన వికేంద్రీకరణపై కాకుండా ప్రజలను రక్షించడానికి రాష్ట్ర మంత్రివర్గం, ప్రజాప్రతినిధులు, అధికారులు దృష్టి సారించాలని విజ్ఞప్తి చేశారు.
అలానే పరిపాలన వికేంద్రీకరణ, సీఆర్‌డీఏ రద్దు బిల్లులకు గవర్నర్ ఆమోదం తెలిపన నేపథ్యంలో రాజధాని రైతుల పరిస్థితిపై జనసేన రాజకీయ వ్యవహారం కమిటీలో చర్చించి భవిష్యత్ ప్రణాళిక రూపొందిస్తామని పవన్ తెలిపారు. రైతులకు ఏ విధంగా అండదండలు అందించాలో ఈ సమావేశంలో చర్చిస్తామన్నారు. రైతుల కోసం జనసేన తుది వరకు పోరాడుతుందని హామీ ఇచ్చారు.