ఆరాటం పెళ్లి కొడుకు పేరంటానికి వెళ్ళాడు అన్నట్టుగా తయారయ్యింది. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పరిస్థితి. అధికారంలోకి రావాలనే తొందర ఆయనలో స్పష్టంగా కనిపిస్తోంది. అందుకే ఏపీ లో బలం అంతంతమాత్రంగా ఉన్న సమయంలోనే, ఏమాత్రం పార్టీ హడావుడి లేని తెలంగాణలో పోటీ చేసేందుకు జనసేన పార్టీని సిద్ధం చేశారు. ఈ మేరకు ఒక ప్రకటన కూడా చేసి ఏ పార్టీతోనూ పొత్తు పెట్టుకోబోమని, సొంతంగానే ఎన్నికల బరిలోకి వెళ్లి గ్రేటర్ లో కొన్ని స్థానాలను దక్కించుకుంటాము అని గొప్పగా ప్రకటించారు. ఏపీ బిజెపి జనసేన పార్టీల పొత్తు కొనసాగుతున్న సమయంలో, గ్రేటర్ లో విడివిడిగా పోటీ చేయడం ఏంటా అనే సందేహాలు అందరిలోనూ వ్యక్తమయ్యాయి.
అయినా పవన్ మాత్రం, గ్రేటర్ లో కొన్నిచోట్ల అభ్యర్థులను ప్రకటించడమే కాకుండా , నామినేషన్లు సైతం వేయించారు. అయితే బీజేపీ కీలక నేతలు కిషన్ రెడ్డి వంటివారు జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాలు చైర్మన్ నాదెండ్ల మనోహర్ తో చర్చలు జరపడం, గ్రేటర్ లో బీజేపీకి సంపూర్ణ మద్దతు ఇస్తున్నామని , తాము పోటీ నుంచి తప్పుకుంటున్నట్లు జనసేన పార్టీ ప్రకటించింది. అంతేకాకుండా ప్రస్తుతం బరిలో ఉన్న అభ్యర్థులు వెంటనే పోటీ నుంచి వైదొలగాలని, నామినేషన్ పత్రాలను వెనక్కి తీసుకోవాలని సూచించారు.జనసేన పార్టీ ఒంటరిగా పోటీ చేస్తుందని ప్రకటించిన 24 గంటల్లోనే ఈ విధంగా యూటర్న్ తీసుకోవడం పై జనసేన నాయకులు సైతం విస్మయం వ్యక్తం చేస్తున్నారు.
తెలంగాణలో బలం లేదని తెలిసినా పోటీ చేయడమే సాహసం అయితే, ఇప్పుడు అకస్మాత్తుగా వెనక్కి తగ్గుతున్నట్లు ప్రకటించి మరింత చులకన భావం ప్రజల్లో వ్యక్తమయ్యేలా చేశారని, ఈ ప్రభావం ఖచ్చితంగా ఏపీలోనూ పడుతుందని జనసైనికులు ఆందోళన చెందుతున్నారు. జనసేన పార్టీ తరఫున టికెట్ దక్కించుకుని, నామినేషన్లు దాఖలు చేసిన అభ్యర్థులు ఇప్పుడు అకస్మాత్తు నిర్ణయంతో తీవ్ర విస్మయానికి గురైనట్లు తెలుస్తోంది. అంతేకాకుండా జనసేన కార్యకర్తలు అంతా, పూర్తిగా బీజేపీకి మద్దతు ఇచ్చి బిజెపి అభ్యర్థులను గ్రేటర్ లో గెలిపించాల్సిన బాధ్యత తీసుకోవాలటూ పవన్ సూచించారు. ఈ విషయం లో పార్టీ నాయకులు ఎవరూ నిరాశ చెందవద్దని, ప్రధాని నరేంద్రమోదీ ఆధ్వర్యంలో హైదరాబాద్ విశ్వ నగరంగా రూపు దిద్దుకుంటుంది అంటూ పవన్ ఆకాంక్షించారు.
అసలు ఏపీలో పొత్తు ఉన్న సమయంలో కనీసం బిజెపి తెలంగాణ నేతలతో సంప్రదించకుండానే ఒంటరిగా పోటీ చేస్తాము అంటూ హడావుడి చేయడం, ఆ తరువాత వెనక్కి తగ్గడం, క్యాడర్ లో అనవసర గందరగోళం రేకెత్తించడం, ఇలా ఎన్నో వ్యవహారాలు చోటు చేసుకోవడం వంటి వ్యవహారాలు జనసేనలోని గందరగోళం ను తెలియజేస్తున్నాయి.
-Surya