ప్రపంచ దేశాల హెచ్చరికలను బేఖాతరు చేస్తూ కొన్నినెలల నుంచి వరుసగా సరికొత్త ఆయుధ పరీక్షలు నిర్వహిస్తోంది ఉత్తర కొరియా. ఇప్పటికే క్షిపణులను ప్రయోగించింది. వీటిలో ఖండాంతర బాలిస్టిక్ మిస్సైల్స్ కూడా ఉన్నాయి. ఉత్తర కొరియా అణ్వాయుధ పరీక్షల నేపథ్యంలో జపాన్ అప్రమత్తమైంది. యమగత, నిగత ప్రాంతాల ప్రజలను ఇళ్లలోనే ఉండాలని లేదా అండర్ గ్రౌండ్‌లోకి వెళ్లాలని సూచించింది. రేడియా, దూరదర్శన్, మొబైల్స్, లౌడ్ స్పీకర్ల ద్వారా ప్రచారం చేసింది.
అంతే కాకుండా బుల్లెట్ రైళ్లను జపాన్ సర్కార్ తాత్కాలికంగా నిలిపివేసింది. ఆ తర్వాత పునరుద్ధరించింది. ప్యాంగ్యాంగ్ చేపట్టిన ఖండాంతర బాలిస్టిక్ క్షిపణి గరిష్ఠంగా 2 వేల కిలోమీటర్ల ఎత్తుకు, 750 కిలో మీటర్ల దూరం ప్రయాణించినట్లు జపాన్ సైనికవర్గాలు ప్రకటించాయి. ఆ తర్వాత ట్రాక్ చేయలేకపోయినట్లు పేర్కొన్నాయి.
ప్యాంగ్‌యాంగ్ పరీక్షించిన ఖండాంతర బాలిస్టిక్ మిస్సైల్ తమ ఉత్తర భాగంపై నుంచి వెళ్తుందని జపాన్ కలవరం చెందింది. ఆ తర్వాత అంచనాలను సవరించిన అధికారులు, తమ భూభాగం నుంచి వెళ్లలేదంటూ ఊపిరి పీల్చుకున్నారు. అంచనా వేసిన ప్రాంతాల్లో ఎలాంటి నష్టం జరిగినట్లు, ప్రజలు గాయపడినట్లు సమాచారంలేదని సంబంధిత వర్గాలు ప్రకటించాయి.