పానీపూరి, గోల్ గప్ప.. ఇలా పేరేదైనా ఇది నచ్చని వారంటూ ఎవరూ ఉండరు. ముఖ్యమంత్రుల నుంచి ప్రధాని వరకు పానీపూరి ఫ్యాన్సే. మన దేశంలోనే కాదు విదేశీయులు కూడా గోల్ గప్పకు అభిమానులే. అందుకే భారత్ పర్యటనలో ఉన్న జపాన్ ప్రధానమంత్రి ఫుమియో కిషిదకు ప్రధాని మోదీ మన దేశ వంటకాలు రుచి చూపించారు. ప్రత్యేకంగా ఇండియాలో ఫేమస్ స్ట్రీట్ ఫుడ్ అయిన పానీపూరిని ఆయనకు తినిపించారు. మన పానీపూరీ రుచి జపాన్ ప్రధానికి ఎంతగానో నచ్చేసిందట.
భారత్ , జపాన్ మధ్య సాంస్కృతిక సంబంధాల బలోపేతంపై చర్చించేందుకు గానూ ఇరు దేశాల ప్రధానులు సోమవారం దిల్లీలోని బుద్ధ జయంతి పార్క్‌ను సందర్శించారు. ఉద్యానవనమంతా కలియదిరుగుతూ వీరిద్దరూ ముచ్చటించారు. అనంతరం అక్కడి ఫుడ్ స్టాళ్ల వద్దకు వెళ్లి భారతీయ అల్పాహార వంటకాలను, పానీయాలను రుచిచూశారు. ఇరు దేశాల ప్రధానులు కవ్వంతో మజ్జిక చిలికారు.
ఆ తర్వాత కిషిదకు ప్రధాని మోదీ పానీపూరీ గురించి చెప్పి దాని రుచి చూపించారు. ఆ రుచిని ఇష్టపడ్డ జపాన్ ప్రధాని ఇంకోటి కావాలని అడిగారు. పానీపూరీతో పాటు ఫ్రైడ్ ఇడ్లీ, మామిడితో చేసిన షర్‌బత్‌ను కిషిద రుచి చూశారు.