వికలాంగులు హానికరమంటూ సైకో కిరాతకం…మరణశిక్ష ఖరారు చేసిన కోర్టు

-

వికలాంగులు ఎవరైనా ఉన్నారు అంటే అయ్యో పాపం అని అనుకుంటాం,లేదంటే ఎదో మనకు తోచిన సాయం వారికి చేస్తూ ఉంటాం. అయితే జపాన్ కు చెందిన ఒక వ్యక్తి మాత్రం వికలాంగులు హానికరం అంటూ వారిపై కత్తితో దాడికి దిగి ఏకంగా 19 మంది వికలాంగులను అతి కిరాతకంగా హత్య చేసాడు. 2016 జూలై 26వ తేదీన చోటుచేసుకున్న ఈ ఘటనకు సంబంధించి తాజాగా కోర్టు సంచలన తీర్పు వెల్లడించింది. జపాన్ దేశ రాజధాని నగరం టోక్యో లోని సగమిహార అనే ఒక సంరక్షణ గృహం లో 30 ఏళ్ల సటోషీ విమాట్సు అనే వ్యక్తి పనిచేసేవాడు. అయితే 2016 జులై 26 వ తేదీ తెల్లవారు జామున తన వెంట కత్తులను తెచ్చుకున్నాడు. కిటికీ అద్దాలు పగలగొట్టి లోపలికి ప్రవేశించిన అతను లోపల నిద్రిస్తున్న వికలాంగులను ఒక్కొక్కరిని చంపుకుంటూ వెళ్లాడు. ఈ ఉన్మాద దాడిలో 19 మంది మరణించగా, మరో 25 మంది తీవ్రంగా గాయపడ్డారు. బాధితులంతా 19 నుంచి 70 ఏళ్ల మధ్య వయస్సు వారే. తన హింసాకాండ పూర్తయిన తర్వాత సటోషి నేరుగా పోలీస్ స్టేషన్‌కు వెళ్లి లొంగిపోయాడు. ఈ సమయంలో అతని వద్ద రక్తంతో తడిసిన అనేక కత్తులు లభించాయి. దాడి జరిగిన సమయంలో సంరక్షణ కేంద్రంలో 150 మంది వికలాంగులు, 9 మంది పనివాళ్లు ఉన్నారు. ఈ దాడితో ప్రపంచంతో పాటు జపాన్ దిగ్భ్రాంతికి గురైంది. అప్పటి నుంచి సుధీర్ఘ విచారణ జరిపిన కోర్టు సోమవారం తుది తీర్పు వెలువరించింది.

ఈ సందర్భంగా న్యాయమూర్తి మాట్లాడుతూ…ఇతనిపై ఎటువంటి దయా, దాక్షిణ్యాలు చూపాల్సిన అవసరం లేదని,19 మంది ప్రాణాలు తీయడం అత్యంత తీవ్రమైన విషయం అని న్యాయమూర్తి వ్యాఖ్యానించారు. ఈ హత్యలన్నీ నిందితుడు ఉద్దేశ్యపూర్వకంగానే చేశాడని ఆయన స్పష్టం చేశారు. దివ్యాంగులు హానికరం, వారు దురదృష్టాన్ని తీసుకొస్తారని తనకు అవకాశం ఇస్తే మరో 470 మంది దివ్యాంగులను చంపేస్తానంటూ వ్యాఖ్యానించడం సంచలనం కలిగించింది.ఈ నరహంతకుడికి కోర్టు మరణశిక్ష విధించడం పట్ల బాధితుల కుటుంబసభ్యులు హర్షం వ్యక్తం చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news