రాజకీయాలు ఎప్పుడు ఎలా మారతాయో చెప్పాల్సిన అవసరం లేదు. అవసరం-అవకాశం అనే రెండు పడవలపైనేసాగే ఈ రాజకీయప్రయాణంలో నాయకులు తమకునచ్చిన మార్గాన్ని ఎంచుకోవడం, సుఖంగా ప్రయాణించాలని కోరుకోవడం తెలిసిందే. అందుకే గత రెండు దశాబ్దాలుగా కూడా రాష్ట్రంలో వ్యక్తిగత ఇమేజ్‌ను పెంచుకునేందుకునాయకులు ఉత్సాహంతో ముందుకు వెళ్తున్నారు. పార్టీ నమ్ముకుంటే.. ఎప్పుడు ఎలాంటి అవమానాలు వస్తాయోనని భయపడుతున్న నాయకులు తమ ఇమేజ్ ఉంటే.. ఏ పార్టీ అయినా ఆదరించకపోతుందా.. అనే ధోరణిని ప్రదర్శిస్తున్నారు. దీంతో పార్టీలే నాయకులను పట్టుకుని వేలాడుతున్నాయి.
ఒకప్పుడు నాయకులు పార్టీలను పట్టుకుని వేలాడేవారు. కానీ, ఇప్పుడు మాత్రం నాయకులను పట్టుకుని వేలాడుతున్న పార్టీలు కనిపిస్తున్నాయి. దీంతో నాయకులు తమకు అవకాశం ఇచ్చే పార్టీని, తమకు అండగా ఉండే పార్టీని నమ్ముకునేందుకు రెడీ అవుతున్నారు. ఇలాంటి వారిలో ఇప్పుడు అనంతపురం జిల్లా జేసీ దివాకర్, ప్రభాకర్ కుటుంబం కూడా కనిపిస్తోంది. ఒకప్పుడు కాంగ్రెస్‌లో చక్రం తిప్పిన ఈ కుటుంబం 35 ఏళ్లపాటు తాడిపత్రిని అప్రతిహతంగా గెలుచుకుంది. కానీ, రాష్ట్ర విబజన ఎఫెక్ట్‌తో కాంగ్రెస్‌ను విడిచి బయటకు వచ్చి టీడీపీలో చేరింది. అక్కడ కూడా ఎంపీ, ఎమ్మెల్యేగా గెలిచి చక్రం తిప్పింది.
2014లో టీడీపీ అధికారంలోకి రావడం కూడా జేసీ కుటుంబానికి బాగా కలిసి వచ్చింది.ఈ క్రమంలోనే పట్టుబట్టి తమ కుమారులకు అవకాశం ఇప్పించుకున్నారు. అయితే, రాజకీయాల్లో పరిస్థితులు ఊహించినట్టుగా ఉండవు కాబట్టి ఆ ఇద్దరు పుత్రరత్నాలు ఓడిపోయారు. ఇక, పార్టీ కూడా అధికారంలోకి రాలేక పోయింది. ఈ పరిణామాలు ఇలా ఉన్నప్పటికీ.. ఈ కుటుంబం టీడీపీలోనే ఉంది. అయితే, ఇటీవల కాలంలో జగన్ సర్కారు నుంచి ఎదురవుతున్న కేసుల నేపథ్యంలో జేసీ కుటుంబానికి పార్టీ అండగా నిలవలేక పోతోందనే భావన వ్యక్తమవుతోంది.
ముఖ్యంగా అనంతపురం టీడీపీ నేతలు జేసీ కుటుంబానికి అండగా ఉండడం లేదు. దీనిపై దివాకర్ రెడ్డి చంద్రబాబుకు ఫిర్యాదు చేశారు. అయినా మార్పు రాలేదు. దీంతో ఇక, పార్టీలో ఉండడం కన్నా.. జాతీయస్థాయిలో చక్రం తిప్పుతున్న బీజేపీకి అండగా ఉంటే..పార్టీ ఇక్కడ తమకు అండగా ఉంటుందని దివాకర్‌రెడ్డి ఓనిర్ణయానికి వచ్చినట్టు చెబుతున్నారు. దీంతో వారు టీడీపీతో కటీఫ్‌కు సిద్ధమవుతున్నారని, కేంద్రంలోని బీజేపీతో కలిసిపోతే.. జగన్‌ను నియంత్రించడంతోపాటు వ్యాపారాలను సజావుగా చేసుకునేందుకు అవకాశం ఉంటుందని అంటున్నారు. మరి ఏంజరుగుతుందో చూడాలి.