వైసీపీ ఎంపీ రఘురామకృష్ణం రాజు వ్యవహారం కొన్నాళ్లుగా రాజకీయాల్లో నలుగుతూనే ఉంది. నిజానికి ఈ వ్యవహారం అంతా ఫాలో అయిన వారికి.. అబ్బ! ఎంపీ రఘులో ఇంత సబ్జెక్ట్ ఉందా అనుకున్నారు. లేదు.. లేదంటూనే ఆయన వైసీపీని ముప్పుతి ప్పలు పెట్టారు. అంతేకాదు, పార్టీ గుర్తింపునే ప్రశ్నించేస్థాయికి ఆయన చేరిపోయారు. దీంతో.. రాజకీయాల్లో అప్పటి వరకు ఆయనను సమర్ధించిన వారు కూడా అబ్బో ఈ ఎంపీ చాలా ముదురు గురూ.. అనుకున్నారు. వైసీపీలోనూ నాయకులు ఆయనను చాలా దూరం పెట్టారు. ఇక, ఆయనకు షోకాజ్ నోటీసు జారీచేయడం, దానికి ఆయన సమాధానం చెప్పకుండా ఎదురు ప్రశ్నలు సంధించడం తెలిసిందే.
సరే! ఇదంతా ఎంపీగారి ఓల్డ్ స్టోరీనే! అయితే, ఇప్పుడు ఇదే ఎంపీలో కొత్త కోణం ఒకటి ఆవిష్కృతమైంది. అది.. ఆయనలో ఉన్న పాత్రికేయుడు. రఘులో పాత్రికేయుడు కూడా ఉన్నాడా? అనే విషయం.. తాజాగా మంగళవారం నాటి ఓ పత్రికను చూసే వరకు కూడా ఎవరికీ అనిపించదు. తెలుగు మీడియాలోని ఓ పత్రికకు ఆయన పెద్ద వ్యాసం రాసుకొచ్చారు. అది కూడా కరెంట్ హాట్ టాపిక్ అయిన.. చైనా-ఇండియా రగడే కావడం మరింతగా విశేషం కావడం.
ఆది నుంచి ఆయనను వెనుకేసుకొస్తున్న, సమర్ధిస్తున్న.. ఆయనను హైలెట్ చేస్తున్న ఓ మీడియాకు చెందిన పత్రికలో ఎడిటోరియల్ పేజీలో ఈ రోజు.. ఆయన రాసిన రాతలు చూశాక.. రఘులో మరో మనిషి కూడా దాగి ఉన్నాడే అనిపించింది. మొత్తంగా ఆయన మరోసారి కేంద్రంలోని నరేంద్ర మోడీ సర్కారును కాకా పట్టే పనిని చేపట్టారు. `ఆత్మరక్షణలో చైనా` అంటూ సాగిన ఈ వ్యాసంలో రఘు ఒకరకంగా చెలరేగిపోయారు. మోడీ దూకుడు కారణంగానే చైనా తోకముడిచిందని, గ్వాలాన్‌లో సాయుధులు కానప్పటికీ.. మన సైనికులు విజృంభించి.. చైనా సైనికులపై విరుచుకుపడ్డారని దేశభక్తిని వలకబోశారు రఘు.
అంతిమంగా ఆయన తేల్చింది.. రాసింది.. ఏంటంటే.. మోడీని మరింత ఆకాశానికి ఎత్తుకోవడమే! మొన్నామధ్య వైసీపీ అధినేత, సీఎం జగన్‌కు ప్రత్యత్తురం ఇస్తూ.. అదే చేత్తో మోడీని ఆకాశానికి ఎత్తేస్తూ.. ఓ వీడియో ను విడుదల చేశారు. జయం మనది.. జయం మనది.. అంటూ ఓల్డ్ సాంగ్ ప్యారెడీ చేసి.. మోడీని ఆకట్టుకునే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలోనే మరో రాయి వేశారని అంటున్నారు పరిశీలకులు. కుదిరితే.. రాజుగారి కలం విన్యాసం మీరూ చదివి తరించండి..!