టీడీపీ కి గట్టి పట్టున్న జిల్లా గుంటూరు. రాజధాని ఏర్పాటుతో ఈ పట్టు మరింత పెరిగింది. అయితే.. గత ఎన్నికల్లో పార్టీ ఇక్కడ కేవలం రెండు స్థానాల్లోనే విజయం దక్కించుకుంది. పైగా .. గుంటూరు వ్యాప్తంగా టీడీపీకి బలమైన సామాజిక వర్గం కమ్మల్లో ఒక్క ఎంపీ గల్లా జయదేవ్ తప్ప అందరూ ఓడిపోయారు. జిల్లా వ్యాప్తంగా పది మంది కమ్మ సామాజిక వర్గానికి చెందిన సీనియర్లు పోటీ చేశారు. వీరిలో అందరూ సీనియర్లే కావడం గమనార్హం. దీనికి తోడు పార్టీ అధినేత చంద్రబాబు తనయుడు.. లోకేష్ కూడా ఇక్కడ నుంచి పోటీ చేసి ఓడిపోయారు. దీంతో వచ్చే ఎన్నికల నాటికైనా.. అందరూ పుంజుకుని పార్టీని మళ్లీ గెలిపిస్తారని.. చంద్రబాబు ఆశలు పెట్టుకున్నారు.
కానీ, ఆశలు మాత్రం తీరేలా కనిపించడం లేదు. ఎందుకంటే..ఎవరికివారే.. యమునాతీరే! అన్న విధంగా గుంటూరు కమ్మ నేతలు వ్యవహరిస్తున్నారు. ఎక్కడా వారిమధ్య సఖ్యత కనిపించడం లేదు. వినుకొండ, పెదకూరపాడు, గురజాల, నరసారావు పేట.. తెనాలి, చిలకలూరిపేట,.. ఇలా అన్ని నియోజకవర్గాల్లోనూ నేతలు.. డమ్మీలుగా మారారో.. లేక .. ఎవరివ్యాపారాలు వారు చేసుకుంటున్నారో.. లేక ఏం మాట్లాడితే.. ఏం జరుగుతుందోననే బావనతో ఉన్నారో.. తెలియదు కానీ.. నేతలు మాత్రం పెదవి విప్పడం లేదు.. పార్టీ తరఫున వాయిస్ వినిపించడం లేదు.
అయితే.. దీనికి మరో ప్రధాన కారణం కూడా కనిపిస్తోంది. ఇటీవల.. పొన్నూరు మాజీ ఎమ్మెల్యే సీనియర్ నాయకుడు.. ధూళిపాళ్ల నరేంద్రను ప్రభుత్వం టార్గెట్ చేసిన విషయం తెలిసిందే. దీంతో ఆయన కేసుల్లో చిక్కుకుని చాలా ఇబ్బంది పడ్డారు. ఈ క్రమంలో తమ మెడకు కూడా చుట్టుకుంటుందని.. పలువురు భావిస్తున్నట్టు సమాచారం. ఇక, నారా లోకేష్ పైకి హంగామా చేస్తున్నా.. నియోజకవర్గంపై మాత్రం పట్టు పెంచుకోలేకపోతున్నారు. ఇక్కడ పర్యటించడం కూడా లేదు. కేవలం రాష్ట్ర సమస్యలను మాత్రమే ఆయన టార్గెట్ చేస్తున్నారు తప్ప.. ఇంతకు మించి ఏమీ చేయడం లేదని అంటున్నారు.
ఈ పరిణామాలతో టీడీపీ పార్టీ పరిస్థితి దినదినగండంగా మారిపోయిందనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. ఇక్కడ చిత్రం ఏంటంటే.. ఇతర సామాజిక వర్గాలకు చెందిన నేతలు కూడా పార్టీకి ఉన్నప్పటికీ.. గతంలో కమ్మ సామాజిక వర్గం డామినేషన్ ఎక్కువగా ఉండడంతో వారిని ఎదగనివ్వలేదు. దీంతో ఇప్పుడు కమ్మ సామాజిక వర్గం డౌన్ అవడంతో వారు కూడా మౌనంగానే ఉంటున్నారు. ఈ పరిణామాలు.. పార్టీకి ఇబ్బందులు తీసుకువస్తాయని అంటున్నారు. అయితే.. రాజధాని ఉద్యమం ఒక్కటే పార్టీని కాపాడుతుందని. ఎప్పుడు ఎన్నికలు జరిగినా.. ఈ ఉద్యమంతో గెలిచిపోవచ్చని పలువురు భావిస్తున్నారు. మరి ఏం జరుగుతుందో చూడాలి.