స్నేహానికి ఎల్లలంటూ ఏవీ లేవు. ఎవరికైనా గొప్ప స్నేహితులు ఉంటే అంతకు మించిన ఆస్తి మరొకటి లేదనే చెప్పవచ్చు. పురాణాల విషయానికి వస్తే మహాభారతంలో కర్ణుడు, దుర్యోధనుల స్నేహం నేటితరం స్నేహితులకు ఇప్పటికీ ఆదర్శమే.
మనకు ఎవరెవరు అమ్మానాన్నలుగా ఉండాలో ఆ దేవుడే పై లోకంలో నిర్ణయిస్తాడు. కానీ స్నేహితుల్ని ఎంపిక చేసుకునే అవకాశం మాత్రం మనకే ఉంటుంది. అమ్మ, నాన్న.. అన్న పదాల తరువాత అంతటి ఆత్మీయతను పంచే పదం.. స్నేహమే.. మనుషులకు స్నేహమన్నది దేవుడిచ్చిన గొప్ప వరం. ఎవరైనా సరే మంచి స్నేహితున్ని సంపాదించుకుంటే.. ఇంక వారు జీవితాంతం సంతోషంగా ఉంటారని చెప్పవచ్చు. స్నేహితుడు మనలా ఆలోచిస్తాడు. మనకు గురువులా అన్ని విషయాలు బోధిస్తాడు. తప్పు చేసినప్పుడు మందలిస్తాడు. మంచి స్నేహితుల మధ్య ఎలాంటి రహస్యాలు ఉండవు. అలాగే మొహమాటాలు కూడా ఉండవు. కేవలం సుఖంలోనే కాదు, కష్టాల్లోనూ తోడుండేవాడే.. నిజమైన స్నేహితుడు..
స్నేహానికి ఎల్లలంటూ ఏవీ లేవు. ఎవరికైనా గొప్ప స్నేహితులు ఉంటే అంతకు మించిన ఆస్తి మరొకటి లేదనే చెప్పవచ్చు. పురాణాల విషయానికి వస్తే మహాభారతంలో కర్ణుడు, దుర్యోధనుల స్నేహం నేటితరం స్నేహితులకు ఇప్పటికీ ఆదర్శమే. తనను గౌరవించిన దుర్యోధనుడికి తన ప్రాణమైనా ఇస్తానని కర్ణుడు వాగ్దానం చేస్తాడు. అలా వారి స్నేహం కొనసాగుతుంది. ఇక కురుక్షేత్ర యుద్ధంలో రాత్రి పూట పాండవులపై అధర్మ యుద్ధం చేయమని దుర్యోధనుడు తన స్నేహితుడైన కర్ణున్ని కోరుతాడు. అయితే నిజానికి అలా రాత్రి పూట యుద్ధం చేయడం ధర్మం కాదు. కానీ స్నేహితుడు కోరాడని చెప్పి కర్ణుడు ధర్మాన్ని కూడా లెక్కచేయడు. అదీ.. వారిద్దరి మధ్య ఉన్న స్నేహానుబంధానికి చక్కని ఉదాహరణ.
ఇక శ్రీకృష్ఱుడు, కుచేలుడి చెలిమి కూడా కొనియాడదగినదే. వీరిద్దరూ కలిసి సాందీప మహర్షి ఆశ్రమంలో విద్యాభ్యాసం చేస్తారు. అయితే శ్రీకృష్ణుడు యాదవ వంశ రాజు కనుక తమ రాజ్యాన్ని పాలిస్తుంటాడు. మరోవైపు కుచేలుడు పేదరికంతో అలమటిస్తుంటాడు. అయితే శ్రీకృష్ణుడు తన స్నేహితుడైనప్పటికీ తనను ఆదరిస్తాడా.. అన్న సందేహం కుచేలుడిలో ఉంటుంది. కానీ కుచేలుడు ధైర్యం చేసి తన చిన్ననాటి స్నేహితుడు కృష్ణుడి వద్దకు వెళ్తాడు. దీంతో కుచేలుడి జీవితమే మారిపోతుంది. అప్పటి వరకు కటిక పేదరికం అనుభవించిన అతను అష్టైశ్వర్యాలలో మునిగి తేలుతాడు. అదంతా స్నేహితుడైన కృష్ణుడి చలవే. వారిద్దరి మధ్య అంత గాఢమైన స్నేహం ఉంది కాబట్టే కృష్ణుడు కుచేలుడికి సహాయం చేసి ఆదుకున్నాడు. వీరిద్దరి మైత్రి చాలా అపురూపమైంది. ముఖ్యంగా డబ్బే లోకమైన నేటి సమాజంలో ఇలాంటి స్నేహితులు మనకు దాదాపుగా దొరకరనే చెప్పవచ్చు.