కర్నాటక రాజకీయాల్లో ప్రస్తుతం ముడా స్కామ్ కలకలం రేకెత్తిస్తోంది. ఈ తరుణంలో సీఎం సిద్దరామయ్యకు హైకోర్టులో ఊరట లభించింది. ఆ కుంభకోణానికి సంబంధించి తనను విచారించేందుకు గవర్నర్ అనుమతి మంజూరు చేయడాన్ని సీఎం హైకోర్టులో సవాల్ చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే కోర్టు స్పందన వచ్చింది. ఆయనపై ఎలాంటి తక్షణ చర్యలు తీసుకోవద్దని ట్రయల్ కోర్టును ఉన్నత న్యాయస్థానం ఆదేశించింది. దీనిపై తదుపరి విచారణ ఆగస్టు 29న జరగనుంది. అప్పటివరకు వరకు తాత్కాలిక రక్షణ అమల్లో ఉండనుందని తెలిపింది.
సీఎం సిద్ధరామయ్య భార్య పార్వతమ్మ పేరిట మైసూరు ప్రాంతంలో ఉన్న భూములను గతంలో అభివృద్ధి పనుల కోసం ముడా సేకరించింది. పరిహారంగా ఆమెకు మైసూరు- విజయనగరలో స్థలాలు కేటాయించింది. సీఎం మౌఖిక ఆదేశాలతో ముడా అధికారులు ఆమెకు ఖరీదైన ప్రాంతంలో విలువైన స్థలాలు కట్టబెట్టారని విపక్ష భాజపా, జేడీఎస్ ఆరోపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఆయన, విచారణకు అనుమతిస్తూ గవర్నర్ ఉత్తర్వులు ఇచ్చారు. వాటిని ఇవాళ సిద్దరామయ్య హైకోర్టులో సవాల్ చేశారు.