శాంతమూర్తి, పుట్టమణి. 15 ఏండ్ల క్రితం పెద్దలు కుదిర్చిన పెండ్లితో ఈ ఇద్దరు ఒక్కటయ్యారు. ఏడేండ్లపాటు వీరి కాపురం సజావుగా సాగింది. ఇద్దరు పిల్లలు జన్మించారు. ఆ తర్వాత ఉన్నట్టుండి పుట్టమణి ప్రవర్తనలో మార్పులు మొదలయ్యాయి. భర్తగానీ, పిల్లలుగానీ బయటకు వెళ్లి ఇంటికి తిరిగి వచ్చారంటే స్నానం చేయకుండా ఇంట్లో అడుగుపెట్టనిచ్చేది కాదు. ఈ విధంగా పుట్టమణి తనదైన ఓ కొత్తరకం మడికట్టు ఆచారానికి అలవాటుపడింది. అయితే ఆమె వింత ప్రవర్తన చివరికి తనతోపాటు తనభర్తను కూడా పొట్టనపెట్టుకుంది. పిల్లలను అనాథలను చేసింది.
కర్ణాటక రాష్ట్రం, మైసూరు జిల్లాలోని మండహళ్లి గ్రామం శాంతమూర్తి, పుట్టమణిల స్వగ్రామం. పెండ్లి తర్వాత ఇద్దరు పిల్లలు పుట్టేదాకా సజావుగా సాగిన వీరి కాపురంలో పుట్టమణి వింత ప్రవర్తన చిచ్చుపెట్టింది. ఆమె ప్రవర్తన ఎంత విపరీతంగా ఉండేదంటే.. ఇంట్లోంచి ఎవరు బయటికి వెళ్లినా స్నానం చేస్తే తప్ప తిరిగి ఇంట్లోకి అడుగుపెట్టనిచ్చేది కాదు. అంతేకాదు, పిల్లలు మూత్రవిసర్జనకు వెళ్లినా, భర్త పశువులకు మేత వేసినా స్నానం చేసి రావాల్సిందే.
పుట్టమణికి కుల, మతాల పట్టింపు కూడా బాగా ఉండేది. అంతేకాదు, ఇరుగుపొరుగు ఎవరైనా స్నానం చేయలేదని తెలిస్తే.. వారిని ఇంట్లోకి రానిచ్చేది కాదు. భర్తగానీ, పిల్లలుగానీ స్నానం చేయని వ్యక్తులను ముట్టుకుంటే ఇక అంతేసంగతి. వాళ్లు మళ్లీ స్నానం చేస్తే తప్ప ఇంట్లోకి రావద్దనేది. దీంతో శాంతమూర్తి, అతని పిల్లలు రోజుకు 10 నుంచి 15 సార్లు చల్ల నీటితో స్నానం చేయాల్సి వచ్చేది. ఈ చన్నీటి స్నానాలవల్ల పిల్లలకు మాటిమాటికి జ్వరాలు వచ్చేవి. అయినా పుట్టమణిలో మార్పు రాలేదు.
అంతేకాదు, ఆఖరికి శాంతమూర్తి తెచ్చిఇచ్చే కరెన్సీ నోట్లను కూడా నీటిలో కడిగి బట్టలు ఆరవేసే దండేనికి ఆరబెట్టేది పుట్టమణి. ఇలా భార్య విపరీత పోకడలు రోజురోజుకు పెరిగిపోవడంతో శాంతమూర్తిలో సహనం నశించింది. ఈ నేపథ్యంలో బుధవారం శాంతమూర్తి ఒడ్లు అమ్మగా వచ్చిన డబ్బులు తెచ్చి పుట్టమణికి ఇచ్చాడు. వాటిని పుట్టమణి కడిగి ఆరబెట్టడంతో ఇద్దరిమధ్య గొడవ మొదలైంది. ఆ తర్వాత గొడవపడుతూనే పొలం దగ్గరికి వెళ్లారు.
పొలం దగ్గర ఇద్దరి మధ్య గొడవ మరింత ముదిరింది. దీంతో క్షణికావేశానికి లోనైన శాంతమూర్తి గొడ్డలి తీసుకుని పుట్టమణి మెడ నరకడంతో అమె అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. భార్య విలవిల్లాడుతూ ప్రాణాలు విడవడం చూసి శాంతమూర్తి చలించిపోయాడు. వెంటనే ఇంటికి వెళ్లి దూలానికి ఉరేసుకుని తనూ ప్రాణం తీసుకున్నాడు. దీంతో వారి పిల్లలిద్దరూ అనాథలుగా మిగిలారు. స్థానికుల సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.