తెలుగులో బలమైన మార్కెట్‌ని సొంతం చేసుకున్న కార్తి, తమిళంలో తను నటించే ప్రతి సినిమానీ తెలుగులోనూ సమాంతరంగా విడుదల చేస్తుంటారు. ‘ఖైదీ’ తర్వాత మరోసారి దీపావళికి ప్రేక్షకుల ముందుకొస్తున్న ఆయన చిత్రం ‘సర్దార్’. పోలీస్‌గా, గూఢచారిగా కార్తి ద్విపాత్రాభినయం చేసిన చిత్రమిది. తెలుగులో అన్నపూర్ణ స్టూడియోస్ విడుదల చేసింది. మరి ‘సర్దార్’ ఎలా ఉంది? కార్తి మరో విజయాన్నిఅందుకున్నట్టేనా?
కథేంటంటే: విజయ్ ప్రకాశ్ (కార్తి) ఓ పోలీస్ ఇన్‌స్పెక్టర్. సోషల్ మీడియాలో తరచూ ట్రెండింగ్ అవుతుంటాడు. అతని సమయస్ఫూర్తి తెలివి తేటలు అలాంటివి. పని కంటే ముందు చుట్టూ మీడియా ఉందో లేదో చూసుకుంటుంటాడు. ఉందని తెలిశాకే తన పని మొదలు పెడతాడు. ట్రెండింగ్‌లో ఉండటమంటే అంత పిచ్చి. ఆంధ్రా యూనివర్సిటీ నుంచి ఓ ముఖ్యమైన ఫైల్ మాయం అవుతుంది. అందులో సైనిక రహస్యాలు ఉన్నాయని తెలుస్తాయి. ఆ ఫైల్ ఎక్కడుందో కనిపెట్టేందుకు సీబీఐ, రా అధికారులు రంగంలోకి దిగుతారు. విషయం తెలుసుకున్న విజయ్ ప్రకాశ్ తనకి మరింత ప్రాచుర్యం లభిస్తుందని ఆ ఫైల్ కనుక్కునేందుకు నడుం బిగిస్తాడు. ఆ క్రమంలో విజయ్ ప్రకాష్‌కి తన తండ్రి సర్దార్ (కార్తి) గురించి, ఆయన మిషన్ గురించి తెలుస్తుంది. దేశద్రోహిగా ముద్రపడిన సర్దార్ ఎవరు? ఎక్కడుంటాడు? ఆయన చేపట్టిన మిషన్‌లో విజయ్ ప్రకాశ్ ఎలా భాగం అయ్యాడు? తదితర విషయాలతో మిగతా కథ సాగుతుంది.
ఎలా ఉందంటే: తన కథలతో వర్తమాన అంశాల్ని, సామాజికాంశాల్ని స్పృశించడంలో దిట్ట దర్శకుడు పి.ఎస్.మిత్రన్. ఆయన తీసిన ‘అభిమన్యుడు’, ‘హీరో’ చిత్రాలు తెలుగు ప్రేక్షకుల్ని అలరించాయి. ఈసారి సమస్త జీవకోటి ప్రాణధారమైన నీటి నిర్వహణ ప్రైవేటీకరణ అంశాన్ని స్పృశిస్తూ ఓ గూఢచారి కథతో చిత్రాన్ని తీర్చిదిద్దాడు. ఒక దేశం ఒక పైప్‌లైన్ పేరుతో కొంతమంది స్వార్థపరులు నీటిని తమ గుప్పెట్లో పెట్టుకునేందుకు ఏం చేశారు? దాని కోసం ఎక్కడో అజ్ఞాతంలో, దేశద్రోహిగా అని ముద్రపడిన ఓ వ్యక్తి ఎలా బయటికొచ్చి స్వార్థపరుల ఎత్తుల్ని చిత్తు చేశాడన్నది కీలకం. పక్కా ఫార్ములా కథనంతోనే సినిమా మొదలవుతుంది. ఫ్లాష్‌బ్యాక్‌లో సర్దార్ పాత్రని పరిచయం చేస్తూ, ఆ తర్వాత హీరో విజయ్ ప్రకాశ్‌ని రంగంలోకి దించాడు దర్శకుడు. ఆరంభం అంతా హీరోహీరోయిన్ల మధ్య సరదా సన్నివేశాలతో సాగుతాయి. కథలోకి వెళ్లేకొద్దీ సినిమాపై ఆసక్తి ఏర్పడుతుంది. ఈ కథనం కూడా కొత్తదేమీ కాదు. కానీ ప్రేక్షకుడిని మాత్రం ఎంగేజ్ చేయడంలో దర్శకుడు విజయవంతమయ్యాడు. సామాజిక కార్యకర్త సమీరా ( లైలా) మరణం, మాయమైన ఫైల్ చుట్టూ అన్వేషణతో సినిమా ఆసక్తికరంగా సాగుతుంది. ఇలాంటి కథ, కథనాలు భారతీయ తెరకి కొత్తేమీకాదు. యాక్షన్ ప్రధానంగా సాగే ఈ సినిమాకి పోరాట ఘట్టాల పరంగా కూడా ప్రత్యేకమైన హంగులేవీ జోడించలేదు. కానీ కార్తి రెండుపాత్రల్లోని నటనతో ఆకట్టుకుంటాడు. ముఖ్యంగా స్పై పాత్రని తీర్చిదిద్దిన విధానం , దానికి సహజత్వాన్ని జోడించిన తీరు టికెట్టు ధరని గిట్టుబాటు చేస్తాయి.
ఎవరెలా చేశారంటే: హీరో కార్తి గూఢచారి పాత్రలో తండ్రిగా, పోలీస్ పాత్రలో యువకుడిగా చక్కటి అభినయం ప్రదర్శించారు. ఆయన మేకోవర్ విషయంలో తీసుకున్న శ్రద్ధ బాగుంది. పోలీస్ పాత్రలో కూడా స్టైలిష్‌గా కనిపిస్తాడు. షాలినిగా రాశిఖన్నా న్యాయవాది పాత్రలో సందడి చేస్తుంది. లైలా, రాజీషా విజయన్ కథలో కీలకమైన పాత్రలో కనిపిస్తారు. రాథోడ్ పాత్రలో ప్రతినాయకుడిగా చంకీ పాండే నటన ఆకట్టుకుంటుంది. సాంకేతికంగా సినిమా ఉన్నతంగా ఉంది. జీవీ ప్రకాశ్ సంగీతం సినిమాకి ప్రాణం పోసింది. కెమెరా, ఎడిటింగ్ విభాగాలు సినిమాకోసం ఏం కావాలో అదిపక్కాగా చేశాయి. దర్శకుడు మిత్రన్.. కార్తి ఇమేజ్‌కి, తన శైలికి తగ్గట్టుగా ఓ పక్కా మాస్ కథతో ఈ సినిమా చేశారు. నిర్మాణం బాగుంది.
చివరిగా: సర్దార్… ఇంట్రెస్టింగ్ స్పై థ్రిల్లర్ విత్ కార్తి సూపర్ యాక్టింగ్