మునుగోడు ఉప ఎన్నిక వేల తెలంగాణ రాజకీయాలలో జంపింగ్ ల పర్వం శరవేగంగా సాగుతోంది. ఎంతలా అంటే బిజెపిలో చేరి మూడు నెలలు కూడా గడవకుండానే ఆ పార్టీకి దాసోజు శ్రవణ్ షాక్ ఇచ్చారు. బిజెపి పార్టీకి రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను తెలంగాణ బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్ కి పంపించారు. నేడు సాయంత్రం మంత్రి కేటీఆర్ సమక్షంలో టిఆర్ఎస్ కండువా కప్పుకోబోతున్నారు. బిజెపికి రాజీనామా చేసిన సందర్భంగా శ్రవణ్ మాట్లాడుతూ బీజేపీ పార్టీపై తీవ్ర విమర్శలు గుప్పించారు.
తనలాంటి బలహీనవర్గాలకు చెందిన నేతలకు బిజెపిలో స్థానం ఉండదనే విషయం అర్థమైందని అన్నారు. అందుకే బిజెపికి రాజీనామా చేస్తున్నానని చెప్పారు. ఇదిలా ఉంటే దాసోజు శ్రవణ్ కుమార్ టిఆర్ఎస్ లో చేరినందుకు శుభాకాంక్షలు తెలిపారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. తెలంగాణ సాధన కోసం ఆయన ప్రజారాజ్యం నుంచి టిఆర్ఎస్ లో చేరారని.. శ్రవణ్ ఏ పార్టీలో ఉన్న తెలంగాణ అభివృద్ధి కోసం కృషి చేస్తారని అన్నారు. తన స్నేహితుడు భవిష్యత్తులో ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని ఆకాంక్షించారు పవన్ కళ్యాణ్.