ఆ కాంగ్రెస్ లీడ‌ర్ స‌పోర్టుతోనే టీఆర్ఎస్‌లోకి కౌశిక్..!

-

హుజురాబాద్ ఉప పోరు రోజురోజుకూ కీలకంగా మారుతోంది. బరిలో ఉన్న బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్‌పై ఈ రోజు మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులు సంచలన ఆరోపణలు చేయగా, రాజకీయ వర్గాల్లో అది చర్చనీయాంశంగా మారింది. ఇదిలా ఉండగా పాడి కౌశిక్ రెడ్డి టీఆర్ఎస్‌లో చేరిక వెనుక కాంగ్రెస్ పార్టీ కీలక నేత ఉన్నారనే వ్యాఖ్యానాలు బలంగా వినిపిస్తున్నాయి. మొత్తంగా హుజురాబాద్ ఉప ఎన్నిక మినీ 2023 అసెంబ్లీ ఎన్నికలను తలపిస్తున్నాయని రాజకీయ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.

కాంగ్రెస్ పార్టీ నుంచి గతంలో అభ్యర్థిగా ఉన్న పాడి కౌశిక్ రెడ్డి మారిన రాజకీయ పరిస్థితుల రిత్యా అధికార టీఆర్ఎస్ పార్టీలో చేరారు. అయితే, ఆయన చేరికపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మొదటి నుంచి కౌశిక్‌రెడ్డిని రాజకీయంగా ప్రోత్సహిస్తున్న కాంగ్రెస్ పార్టీ కీలక నేత, దగ్గరి బంధువు సలహాతోనే కౌశిక్ అధికార టీఆర్ఎస్ పార్టీలో చేరినట్లు చర్చ జరుగుతోంది. టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి కౌశిక్, ఆ కీలక నేతపై ఎలాంటి చర్యలు తీసుకోకముందే పార్టీని వీడాలని ఆయన సూచించారని తెలుస్తోంది.

ఆ మేరకు కౌశిక్ రెడ్డి ఆగమేఘాల మీద కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారని, ఆ తర్వాత గులాబీ గూటికి వెళ్లారని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఇక టీఆర్ఎస్‌లోనూ కౌశిక్ రెడ్డి రాజకీయ భవిష్యత్తు కోసం కాంగ్రెస్ పార్టీ కీలక నేత తన కోవర్టుల ద్వారా ఎప్పటికప్పుడు సంప్రదింపులు చేస్తారట. మొత్తంగా కౌశిక్ రెడ్డి ప్రాబల్యం టీఆర్ఎస్ అభ్యర్థి గెలుపునకు సాయపడుతుందనేది వారి అంచనా. అయితే, ఇప్పటికున్న పరిస్థితుల నేపథ్యంలో టీఆర్ఎస్ అధిష్టానం ఆచితూచి వ్యవహరిస్తున్నది. ప్రజల మద్దతు కూడగట్టుకునేందుకు గాను ఇతర పార్టీల నేతలపైనా వలలు విసురుతోంది. ఇప్పటికే కౌశిక్, ఎల్.రమణ పార్టీలో చేరగా ఇంకొందరు చేరే అవకాశాలున్నట్లు తెలుస్తోంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version