పాడి రైతులకు కేసీఆర్ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. పాడి పశువులపై ఆధారపడిన రైతులకు బ్యాంకు రుణాలు ఇప్పించడం ద్వారా పాడి పరిశ్రమను మరింత అభివృద్ధి చేసేందుకు కృషి చేయాలని రాష్ట్ర పశుసంవర్ధక మత్స్యశాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ సూచించారు. శుక్రవారం మంత్రి కార్యాలయంలో విజయ డైయిరీ చైర్మన్ సోమ భరత్ కుమార్ అధ్యక్షతన డైయిరీ పాలకమండలి సమావేశం జరిగింది.
బ్యాంకు రుణాలతో ఒక్కో నియోజకవర్గంలో సుమారు మూడువేల పాడి పశువులను రైతులకు ఇప్పించే కార్యక్రమాన్ని రూపొందించాలని నిర్ణయించారు. డైయిరీకి సక్రమంగా పాలు పోసే రైతులకు ముద్ర రుణాలు మంజూరు చేయించాలని అభిప్రాయపడ్డారు. రంగారెడ్డి జిల్లా రావిర్యాలలో రూ.250 కోట్లతో నిర్మిస్తున్న అత్యాధునిక మెగా డైయిరీ మరో ఆరు నెలల్లో ప్రారంభం కానుందని, దీనికి అవసరమైన పాలు సేకరించేందుకు అన్ని చర్యలు చేపట్టాలని తీర్మానించారు.