ప్రీ వెడ్డింగ్ షూట్‌కు వెళ్తుండగా జరిగిన రోడ్డు ప్రమాదంలో నలుగురు దుర్మరణం చెందిన ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో చోటుచేసుకుంది. కారు-లారీ ఢీకొనంతో ఈ ప్రమాదం జరిగింది. ఇల్లెందు-మహబూబాబాద్ మధ్య కోటిలింగాల సమీపంలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో కారు నడుపుతున్న వ్యక్తి సహా ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు. మరో వ్యక్తి ఇల్లెందు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు.
రోడ్డు ప్రమాదం సమాచారం అందడంతో పోలీసులు ఘటనాస్థలికి చేరుకొని సహాయ చర్యలు చేపట్టారు. ఈ ఘటనలో క్షతగాత్రుడు రణధీర్‌ను చికిత్స కోసం ఖమ్మంకు తరలించారు. మృతులు హనుమకొండ జిల్లా కమలాపూర్‌కు చెందిన అరవింద్, వరంగల్‌కు చెందిన రాము, కల్యాణ్, శివగా గుర్తించారు. ప్రీ వెడ్డింగ్ షూట్ కోసం వీరంతా మోతేకి వెళుతున్నట్లు సమాచారం.