ఆదిలాబాద్ లో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో చేపడుతున్న ఆజాదీకా గౌరవ్ పాదయాత్రకు హాజరయ్యారు ఏఐసీసీ కార్యదర్శి, తెలంగాణ ఇన్చార్జి నదీమ్ జావిద్. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సామాన్యుల జీవనం మారాలంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాల్సిందేనని అన్నారు. అధికారంలో ఉన్న కేంద్ర ప్రభుత్వం సామాన్యులను తీవ్ర ఇబ్బందులకు గురి చేయడమే కాకుండా ప్రభుత్వ రంగ సంస్థలను కార్పొరేట్ లకు ధారాదత్తం చేస్తోందని మండిపడ్డారు.
పెట్రోల్, డీజిల్, వంటగ్యాస్ తదితర నిత్యవసర వస్తువుల ధరలు తగ్గాలంటే, నిరుపేద కుటుంబాలు సాఫీగా జీవనం సాగించాలంటే కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురావాలన్నారు. తెలంగాణ లో రాష్ట్రం కోసం పోరాడిన ఉద్యమకారుల ఆశయాలకు అనుగుణంగా పాలన సాగడం లేదన్నారు నదీమ్ జావిద్. ముఖ్యమంత్రి కేసీఆర్ ఓ ప్రైవేట్ కంపెనీలా వ్యవహరిస్తున్నారంటూ ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో టిఆర్ఎస్ పార్టీకి ప్రత్యామ్నాయం కాంగ్రెస్ పార్టీనే అని అన్నారు.