తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్‌ఎస్ గెలుపును ఎవడూ ఆపలేడని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు స్పష్టం చేశారు. నాగార్జునసాగర్ నియోజకవర్గంలోని హాలియాలో నిర్వహించిన ప్రజా ఆశీర్వాద సభలో సీఎం పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘కాంగ్రెస్ ఉన్న నాడు ఎవరినీ చూడలేదు. రూ.200 పెన్షన్ మొఖాన కొట్టి మీ చావు మిమ్మల్ని చావమ్మనది. మొదట రూ.1000 చేసి ఇవాళ రూ.2వేల పెన్షన్ చేసింది ఎవరు? ఓన్లీ బీఆర్‌ఎస్ గవర్నమెంట్.
ఇవాళ మళ్లీ రూ.5వేల పెన్షన్ పెంచుతామని ప్రకటించాం. భగత్‌ను గెలిపించండి అందరి పెన్షన్లు రూ.5వేలకు పెరుగుతయ్. ఎవరు మంచి చేస్తరు.. ఎవరు చెడు చేస్తరు అనే ఆలోచన చేయాలి. ఆలోచన చేయకుండా ఆగమాగం ఓట్లు వేయొద్దు’ అని సూచించారు. ‘ప్రజలందరికీ ఈ విషయం ప్రజలకు తెలిసేలా బీఆర్‌ఎస్ నాయకులు, కార్యకర్తలు పని చేయాలి. మీ గ్రామాల్లో చర్చ పెట్టాలి. ఏది నిజం.. ఏది రాయి.. ఏది రత్నమో చర్చపెట్టి ఓట్లు వేయించాలి. చర్చపెట్టండి.. భగత్ 70-80వేల ఓట్ల మెజారిటీతో గెలుస్తడు అని అన్నారు.
కంటి వెలుగు కార్యక్రమాన్ని భారతదేశంలో ఎక్కడైనా నిర్వహించారా? అని కేసీఆర్ అడిగారు. 3 కోట్ల మందికి కళ్ల పరీక్షలు చేసి అవసరమైన 8 లక్షల మందికి కళ్ల అద్దాలు ఇచ్చామని గుర్తు చేశారు. అమ్మ ఒడి వాహనం వచ్చి తీసుకెళ్లి ప్రసవం చేయించి.. ఇంటికాడ దిగబెడుతున్నదని చెప్పారు. ఆడపిల్ల పుడితే రూ.13వేలు, పిల్లాడు పుడితే రూ.12 వేలు బీఆర్‌ఎస్ ప్రభుత్వం ఇస్తుందని కేసీఆర్ గుర్తు చేశారు. రైతు బంధు, 24 విద్యుత్ అంశాలపై కాంగ్రెస్ నేతలు చేసిన వ్యాఖ్యలపై కూడా సీఎం కేసీఆర్ మాట్లాడారు. రైతుబంధు దుబారా అని, 24 గంటల విద్యుత్ వద్దని.. 3 గంటలు చాలని పీసీసీ అధ్యక్షుడే చెబుతున్నారని.. వారి గోల్‌మాల్ మాటలు విని ఆగం కావొద్దని ప్రజలను కేసీఆర్ కోరారు. ఎన్నికలు పూర్తి కాగానే మార్చి నుంచి రేషన్ కార్డు దారులందరికీ సన్నబియ్యమే ఇస్తామని ప్రకటించారు.