శబరిమల ప్రసాదం పంపిణీ నిలిపివేయాలని కేరళ కోర్టు ఆదేశం..

-

మకర సంక్రాంతి అంటే.. అయ్యప్ప భక్తులకు పండగే.. గత 41 రోజులగా మాల ధరించిన స్వాములు మకర సంక్రాంతి రోజు జ్యోతి చూడటానికి శబరిమల వెళ్తారు..కొండంతా అయ్యప్ప భక్తులతో కోలాహలంగా మారుతుంది. ప్రముఖ ఆలయాలలో దేవుడు ఎంత ఫేమస్సో..అక్కడ ప్రసాదం కూడా అంతే ఫేమస్‌..తిరుపతి లడ్డు, శబరిమల ప్రసాదం, అన్నవరం ప్రసాదం .. వీటిని ఇష్టంగా తినేవాళ్లు ఎంతోమంది.. అయితే శబరిమల ప్రసాదం పంపిణీ ఆపేయాలని కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది.. అసలే ఇది అయ్యప్ప సీజన్‌.. ఈ టైమ్‌లోనే అయ్యప్ప ప్రసాదాలు రాష్ట్రాలు దాటి వెళ్తాయి.. మరి ఇలాంటి సమయంలో పంపిణీ ఎందుకు నిలిపేయమని కోర్టు తీర్పునిచ్చింది..?

శబరిమల ప్రసాదంలో వినియోగించిన యాలకుల్లో క్రిమి సంహారక మందుల ఆనవాళ్లు ఉన్నాయని ల్యాబ్ టెస్టుల్లో తేలింది. శబరిమల ఆలయంలో ‘అరవణ పాయసం’ ప్రసాదం పంపిణీని నిలిపివేయాలని ట్రావెన్‍కోర్ దేవస్థానం బోర్డును కేరళ హైకోర్టు ఆదేశించింది. ప్రసాదం తయారీలో వినియోగిస్తున్న యాలకుల్లో క్రిమిసంహారక మందులు ఉన్నట్టు గుర్తించటంతో హైకోర్టు ఈ ఆదేశాలు జారీ చేసింది. అయితే ప్రస్తుతం, యాలకులు లేకుండా అరవణ ప్రసాదాన్ని తయారు చేసేందుకు ట్రావెన్‍కోర్ దేవస్థానం బోర్డు నిర్ణయించుకుంది. గురువారం నుంచి యాలకులు లేని అరవణ పాయసాన్ని పంపిణీ చేస్తామని ప్రకటించింది. పూర్తి వివరాలు ఇవే..

ప్రసాదం నాణ్యతపై భక్తుల ఫిర్యాదులు..

శబరిమల ప్రసాదంపై కొందరు భక్తులు ఫిర్యాదులు చేయటంతో.. నాణ్యత పరీక్షలు చేయాలని అధికారులను కేరళ హైకోర్టు ఆదేశించింది. ప్రసాదం శాంపిళ్లను ల్యాబ్‍లకు పంపారు. రెండు ల్యాబ్‍ల రిపోర్టులు ఇటీవలే వచ్చాయి. అయితే ప్రసాదంలో పరిమితికి మించి క్రిమి సంహారక మందుల ఆనవాళ్లు ఉన్నట్టు ల్యాబ్ రిపోర్టుల్లో తేలింది. కొన్ని శాంపిళ్లలో 10కి పైగా రసాయనాల జాడలు లభించాయని రిపోర్టుల్లో గుర్తించారు.. వీటిని పరిశీలించిన హైకోర్టు డివిజన్ బెంచ్.. ఇప్పటి వరకు తయారు చేసిన ప్రసాదం పంపిణీని వెంటనే నిలిపి వేయాలని ట్రావెన్‍కోర్ దేవస్థానం బోర్టును ఆదేశించింది. కొత్తగా తయారు చేసే అరవణ ప్రసాదాలను కూడా రెండు రోజుల తర్వాత మళ్లీ ల్యాబ్ టెస్టుకు పంపాలని ఆదేశించింది.

యాలకులు లేకుండా ప్రసాదం..
కొంతకాలం యాలకులు లేకుండానే అరవణ ప్రసాదాన్ని తయారు చేసి, పంపిణీ చేసేందుకు ట్రావెన్ కోర్ దేవస్థానం బోర్డు నిర్ణయించుకుంది. “గురువారం నుంచి యాలకులు లేకుండా అరవణ ప్రసాదాన్ని పంపిణీ చేస్తాం. సేంద్రియ యాలకులను సేకరించేందుకు ప్రయత్నాలు చేస్తున్నామని టీబీడీ ప్రెసిడెంట్ కే.అనంతగోపన్ వెల్లడించారు. భవిష్యత్తులో నాణ్యమైన సేంద్రియ యాలకులను ప్రసాదంలో వినియోగిస్తామని వెల్లడించారు.

ప్రసాదం నుంచే భారీ ఆదాయం..
అరవణ ప్రసాద విక్రయం నుంచి ఆలయ బోర్డు (TBD)కు భారీ ఆదాయం వస్తుంది. భక్తుల రద్దీ ఎక్కువగా ఉండే సమయాల్లో ప్రసాదం ద్వారానే ఆలయ బోర్డుకు 60శాతం ఆదాయం వస్తుంది. భక్తుల రద్దీ ఎక్కువగా ఉండే సీజన్‍లో ప్లాంట్‍లో రోజుకు లక్ష టిన్నుల ప్రసాదాన్ని తయారు చేస్తారట. ఏటా నవంబర్, జనవరి మధ్య ప్రతీ రోజు లక్షలాది మంది భక్తులు శబరిమల ఆలయాన్ని సందర్శిస్తారు. ఈ టైమ్‌లో ఇలా జరగటం గమనార్హం..!!

Read more RELATED
Recommended to you

Latest news