కేరళలో గవర్నర్ ఆరిఫ్ మహ్మద్ ఖాన్, రాష్ట్ర ప్రభుత్వం మధ్య ప్రచ్ఛన్నం యుద్ధం జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ యుద్ధం కాస్త తీవ్రరూపం దాల్చింది. ఏకంగా కేరళ కలమండలం డీమ్డ్ యూనివర్సిటీ ఛాన్సలర్ బాధ్యతల నుంచి ఆరిఫ్ ఖాన్‌ను తొలగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఆయన స్థానంలో సాంస్కృతిక కళా రంగానికి చెందిన ఓ ప్రముఖ వ్యక్తిని నియమించేలా విశ్వవిద్యాలయ నిబంధనలను సవరిస్తూ ఆర్డినెన్స్ జారీ చేసింది. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీకి గవర్నర్ ఆరిఫ్ ప్రతినిధిలా వ్యవహరిస్తున్నారని రాష్ట్ర ప్రభుత్వం ఆరోపించింది.
దక్షిణాదిలో బీజేపీయేతర పార్టీలు అధికారంలో ఉన్న మూడు రాష్ట్రాల గవర్నర్లు, ఆయా రాష్ట్రప్రభుత్వాల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది. తమిళనాడు గవర్నర్‌గా ఆర్.ఎన్ రవిని తొలగించాలని అధికార డీఎంకే పార్టీ, రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు బుధవారం లేఖరాసిన సంగతి తెలిసిందే. మరోవైపు ఆరిఫ్‌ఖాన్‌ను రాష్ట్రంలోని యూనివర్సిటీల ఛాన్స్‌లర్ బాధ్యతల నుంచి తప్పించేందుకు వీలుగా ప్రత్యేక ఆర్డినెన్స్ కోసం కేరళ ప్రభుత్వం కసరత్తు ప్రారంభించింది. అంతేకాకుండా తన ఫోన్ ట్యాపింగ్‌కు గురవుతోందంటూ తెలంగాణ గవర్నర్ తమిళిసై వ్యాఖ్యానించడం చర్చనీయాంశమైంది. ఈ పరిణామాల నేపథ్యంలో కేరళ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం దక్షిణాది రాజకీయాల్లో కీలక ప్రాధాన్యం సంతరించుకుంది.