కేరళ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. మరో ఏడాది పాటు కోవిడ్ నిబంధనలను పాటించాల్సిందగా ప్రజలకు ఆదేశాలు జారీ చేసింది. 2021 జూలై వరకు లేదా మళ్లీ ప్రభుత్వం సూచించేంత వరకు ఆ రాష్ట్రంలోని ప్రజలు కోవిడ్ నిబంధనలను తూచా తప్పకుండా పాటించాలి. ఇప్పుడు పాటిస్తున్నట్లుగానే విధిగా మాస్కులను ధరించాలి. మనిషికి, మనిషికి మధ్య కనీసం 6 అడుగుల దూరం ఉండేలా చూసుకోవాలి. ఇతర కోవిడ్ జాగ్రత్తలనూ పాటించాలి.
కరోనా నేపథ్యంలో కేరళ ప్రభుత్వం 2021 జూలై వరకు కోవిడ్ నిబంధనలను పాటించాలని ఆదేశిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు ఆ రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా కేరళ ఎపిడెమిక్ డిసీజ్ కరోనా వైరస్ డిసీజ్ (కోవిడ్ 19) అడిషనల్ రెగ్యులేషన్స్, 2020 పేరిట కొత్త చట్టాన్ని అమలులోకి తెచ్చింది. దీని ప్రకారం అక్కడ వచ్చే ఏడాది వరకు లేదా మళ్లీ ప్రభుత్వం చెప్పేంత వరకు కోవిడ్ నిబంధనలు అమలులో ఉంటాయి.
కేరళ అమలు చేస్తున్న కోవిడ్ నిబంధనలు ఇవే…
1. ప్రజలు బహిరంగ ప్రదేశాల్లో తిరిగినా, పనిచేసే చోటైనా తప్పనిసరిగా నోరు, ముక్కులను కవర్ చేస్తూ మాస్కులను ధరించాలి.
2. మనిషికి, మనిషికి మధ్య కనీసం 6 అడుగుల భౌతిక దూరం పాటించాలి.
3. పెళ్లిళ్లకు హాజరయ్యే అతిథుల సంఖ్య 50 మందికి మించరాదు. తప్పనిసరిగా కోవిడ్ నిబంధనలు పాటిస్తూ వివాహం జరుపుకోవాలి. శానిటైజర్లు వాడాలి. మాస్కులు ధరించాలి. భౌతిక దూరం పాటించాలి.
4. అంత్యక్రియలకు హాజరయ్యే వారి సంఖ్య 20కి మించరాదు. అక్కడ కూడా కచ్చితంగా కోవిడ్ నిబంధనలు పాటించాలి.
5. ఎలాంటి సభలు, సమావేశాలు, ధర్నాలు, మీటింగ్‌లకు అనుమతులు ఇవ్వరు. అంతగా అవసరం అయితే కేవలం 10 మందికి మాత్రమే అందుకు అనుమతిస్తారు. అక్కడ కూడా వారు కోవిడ్ నిబంధనలను పాటించాలి.
6. చిన్న కిరాణా షాపులు మొదలుకొని కమర్షియల్ కాంప్లెక్సుల వరకు అందరూ కోవిడ్ నిబంధనలను కచ్చితంగా పాటించాలి.
7. బహిరంగ ప్రదేశాల్లో ఉమ్మి వేయడాన్ని నిషేధించారు.
8. కేరళకు వెళ్లేవారు కచ్చితంగా అక్కడి ప్రభుత్వ వెబ్‌సైట్ కోవిడ్ 19 జాగ్రత్త ఇ-ప్లాట్‌ఫాంపై రిజిస్టర్ చేసుకుని అందులో పూర్తి వివరాలను సమర్పించాకే కేరళలోకి అనుమతిస్తారు.
9. రోడ్డు మార్గంలో కేరళకు వెళ్లడాన్ని నిషేధించారు.