మాజీ ఎంపీ వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న కడప ఎంపీ అవినాష్ రెడ్డిని సిబిఐ ఇప్పటికే పలుమార్లు విచారించిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా ఎంపీ అవినాష్ రెడ్డి తెలంగాణ హైకోర్టులో మధ్యంతర పిటీషన్ దాఖలు చేశారు. వివేకా హత్య కేసు విచారణకు సంబంధించిన వివరాలు ఇచ్చేలా సిబిఐ ని ఆదేశించాలని తన పిటీషన్ లో కోరారు.
మార్చి 14న సిబిఐ విచారణకు సంబంధించిన ఆడియో, వీడియో రికార్డులను ఇవ్వాలని కోర్టుని కోరారు ఎంపీ అవినాష్ రెడ్డి. ఇప్పటివరకు అవినాష్ రెడ్డిని సిబిఐ ఈ కేసులో నాలుగు సార్లు విచారించిన విషయం తెలిసిందే. అయితే హత్య కేసులో విచారణకు హాజరుకాకుండా మినహాయింపు కోసం గతంలో అవినాష్ రెడ్డి తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. కానీ తెలంగాణ హైకోర్టు మాత్రం ఆయనకి మినహాయింపు ఇచ్చేందుకు నిరాకరించింది. అలాగే తీర్పు వెలువరించే వరకు ఆయనని అరెస్టు చేయవద్దని సిబిఐ ని ఆదేశించింది.