ఆంధ్రప్రదేశ్ మంత్రి వర్గంలో కిడారి సర్వేశ్వరరావు తనయుడు శ్రావణ్ కుమార్కి నేడు మంత్రి వర్గంలో చోటు దక్కనుంది. దీంతో శ్రావణ్ కుమార్ అరుదైన అవకాశాన్ని పొందనున్నారు. చట్టసభల్లో సభ్యుడు కాకుండానే నేరుగా మంత్రివర్గంలో స్థానం పొందుతున్నారు. నాడు 1995లో నందమూరి హరికృష్ణ తర్వాత ఈ తరహా అవకాశం శ్రావణ్ కే లభిస్తోంది. దీనితో పాటు ఐఐటీలో ఇంజినీరింగ్ చేసిన వ్యక్తి రాష్ట్ర మంత్రివర్గంలో సభ్యునిగా ఉండటం ఇదే తొలిసారి అని తెలుస్తోంది. ఏ సభలోనూ సభ్యుడు కాకుండా మంత్రివర్గంలో చేరితే ఆరు నెలల్లోగా ఏదో ఒక సభకి ఎన్నిక కావాల్సి ఉండనున్న నేపథ్యంలో… సాధారణ ఎన్నికలకు తొమ్మిది నెలల కంటే తక్కువ సమయం ఉండటంతో అరకు స్థానానికి ఉపఎన్నిక జరిగే అవకాశం లేదు. దీనికి తోడు శాసనమండలి స్థానమూ ఖాళీగా లేదు.
ఈ పరిస్థితుల కారణంగా చట్టసభల్లో సభ్యుడు కాకున్నా ఆరు నెలల పాటు మంత్రిగా కొనసాగే అవకాశాన్ని శ్రావణ్‌కి కల్పిస్తున్నారు. ఈ లోగా వచ్చే సాధారణ ఎన్నికల్లో శ్రావణ్‌న్ని పార్టీ అభ్యర్థిగా బరిలో నిలపనున్నారు. కేవలం 28ఏళ్ల వయసులోనే మంత్రి కాబోతున్నారు. ఇప్పటి వరకు అఖిలప్రియనే తక్కువ వయసున్న మంత్రి. శ్రావణ్ రాకతో మంత్రివర్గంలో పిన్న వయస్కుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది.