కరోనా నేపథ్యంలో గత ఏడాదిన్నర కాలం నుంచి పిల్లలు ఇంట్లోనే ఉంటున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే వారు ఆన్‌లైన్ క్లాసులకు హాజరవుతున్నారు. అయితే పిల్లలను ఫోన్లను ఆన్‌లైన్ లెర్నింగ్ కోసం కన్నా మెసేజ్‌లను పంపించుకునేందుకే ఎక్కువగా వాడుతున్నారని తేలింది. ఈ మేరకు ఎన్‌సీపీసీఆర్ చేపట్టిన అధ్యయనంలో ఆ వివరాలు వెల్లడయ్యాయి.
శిశు హక్కుల సంఘం నేషనల్ కమిషన్ ఫర్ ప్రొటెక్షన్ చైల్డ్ రైట్స్ (ఎన్‌సీపీసీఆర్) చేపట్టిన అధ్యయనం ప్రకారం.. దేశంలో 59.2 శాతం మంది పిల్లలు స్మార్ట్‌ఫోన్‌లను మెసేజ్‌లను పంపించుకోవడం కోసమే వాడుతున్నారని తేలింది. కేవలం 10.1 శాతం మంది పిల్లలు మాత్రమే ఆన్‌లైన్ లెర్నింగ్ కోసం ఫోన్లను వాడుతున్నారని తేలింది.
59.2 శాతం మంది పిల్లలు వాట్సాప్, ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, స్నాప్‌చాట్ వంటి యాప్‌లను ఉపయోగించి ఎక్కువగా మెసేజ్‌లను పంపించుకుంటున్నారని తేలింది. వారు ఫోన్లను ఉపయోగించి ఎక్కువగా చదవడం లేదన్నది దీంతో స్పష్టమైంది. ఇంటర్నెట్ యాక్సెస్ ఉండడంతోనే వారు ఇలా చేస్తున్నారని అధ్యయనంలో వెల్లడించారు. కాగా అధ్యయనం ప్రకారం, అన్ని వయస్సులకు చెందిన పిల్లలలో 30.2 శాతం మంది సొంత స్మార్ట్‌ఫోన్‌లను కలిగి ఉన్నారని వెల్లడైంది.
ఇక ఆశ్చర్యకరంగా, పదేళ్ల పిల్లలలో 37.8 శాతం మందికి ఫేస్‌బుక్ ఖాతా ఉందని, అదే వయస్సులో 24.3 శాతం మందికి ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఉందని తేలింది. దీని వల్ల తెలుస్తుందేమిటంటే.. పిల్లలు సోషల్ మాధ్యమాలను ఎక్కువగా వాడుతున్నారని అర్థమవుతుంది. అందువల్ల పిల్లలపై నిఘా ఉంచాల్సిన ఆవశ్యకత ఉందని నిపుణులు అభిప్రాయ పడుతున్నారు.