మన దేశంలో ఎన్నో దేవాలయాలు ఉన్నాయి. భారతదేశం ఆచార సంప్రదాయాలకు పెట్టింది పేరు. ఎన్నో రకాల దేవుళ్లు ఇంకెన్నో రకాలు పట్టింపులు. పుణ్యక్షేత్రాలకు పుట్టినిళ్లు ఈ మట్టి. ఆలయాలు అంటే..ప్రతిరోజు తెరుచుకుని.. భక్తులతో శోభాయమానంగా ఉంటాయి. మన తిరుపతి వెంకన్న ఆలయం అడుగుపెట్టడంతోనే తెలియని ప్రశాంతత. వేలాది మంది భక్తులతో కిటకిటలాడుతూ ఉంటుంది. కానీ కొన్ని ఆలయాలు ఏడాదిలో కొన్ని నెలలే తెరుచుకుంటాయి..అందులో శబరిమల, ఛార్ ధామ్ వంటి పుణ్యక్షేత్రాలు ఉంటాయి. ఏడాదిలో నెల, రెండు నెలలు మాత్రమే భగవంతుడి దర్శనం కల్పిస్తారు. కానీ ఓ ఆలయం మాత్రం ఏడాదిలో కేవలం ఐదు గంటలు మాత్రమే ఆ గుడి తలుపులు తెరుచుకుంటాయట. అలా ఎందుకో, ఇంతకీ ఆ దేవాలయం ఏంటో ఇప్పుడు చూద్దాం
ఛత్తీస్‌గఢ్‌లోని గరియాబంద్ జిల్లా కేంద్రానికి 12 కిలోమీటర్ల దూరంలో కొండపై ఉన్న నీరయ్ మాతా దేవాలయం ఒకటి ఉంది. ఈ ఆలయంలోని నీరయ్ మాతా కేవలం ఛైత్ర నవరాత్రి రోజున తెల్లవారుజామున 4 గంటల నుంచి ఉదయం 9 గంటల వరకు భక్తులకు దర్శనం ఇస్తుందట. అందుకే, ఆ రోజున వేల సంఖ్యలో భక్తులు ఈ ఆలయానికి పొటెత్తుతారు. అయితే, ఇక్కడ పూజా విధానమంతా వేరుగా ఉంటుంది.
సాధారణంగా అన్నీ.. దేవాలయాల్లో అర్చనలకు ఉపయోగించే కుంకుమ, తేనె, అలంకరణ వస్తువులేవి ఇక్కడ ఉపయోగించరట. కేవలం కొబ్బరికాయ కొట్టి.. అగరబత్తులు వెలిగిస్తే చాలు మాతకు పూజలు చేసినట్లే. ఆ ఐదు గంటలు దాటిన తర్వాత ఆలయంలోకి భక్తులను అనుమతించరు. తిరిగి మరుసటి ఏడాది ఛైత్ర నవరాత్రి వచ్చేదాక ఆలయంలోకి ఎవరూ రాకూడదని నిబంధనలు ఉన్నాయి.. అలాగే ఈ గుడిలోకి మహిళల ప్రవేశంపై కూడా నిషేధం ఉంది. అంతేకాదు.. ఈ దేవాలయంలో పంచిన ప్రసాదాన్ని మహిళలు తినకూడదట. తింటే చెడు జరుగుతుందని అక్కడి వారి గట్టి విశ్వాసం.
దీపం దానికదే వెలుగుతుందట!
చైత్ర నవరాత్రుల ప్రారంభంలో నీరయ్ మాతా ఆలయంలోని దీపం దానికదే వెలుగుతుందట. నూనె లేకున్నా.. తొమ్మిది రోజులపాటు దీపం అఖండ జ్యోతిలా వెలుగుతూనే ఉంటుందని స్థానికులు అంటున్నారు. దీని వెనుకన్న రహస్యాన్ని మాత్రం ఇప్పటివరకూ ఎవరూ కనిపెట్టలేకపోతున్నారు.
అయితే ఈ ఆలయాన్ని ఎందుకు ఇలా 5 గంటలు పాటే తెరుస్తున్నారు, మహిళలను ఎందుకు అనుమతించటం లేదు, దీపం అలా ఎవరూ వెలిగించకుండా వెలగటం వెనుకు ఏదైనా సైన్స్ కు సంబంధించిన కారణం ఉందా అనేది ఇంతవరకూ ఎవరూ చెప్పలేదు.