అబుధాబిలో జరుగుతున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2020 టోర్నీ 35వ మ్యాచ్‌లో సన్ రైజర్స్ హైదరాబాద్‌పై కోల్‌కతా నైట్ రైడర్స్ 163 పరుగుల స్కోరు చేసింది. మ్యాచ్‌లో హైదరాబాద్ జట్టు టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకోగా కోల్‌కతా బ్యాటింగ్ చేపట్టింది. ఈ క్రమంలో కోల్‌కతా నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లను కోల్పోయి 163 పరుగులు చేసింది.
కోల్‌కతా బ్యాట్స్‌మెన్లలో ఎవరూ చెప్పుకోదగిన ప్రదర్శన చేయలేదు. కానీ స్కోరు బోర్డును కొంత సేపు ముందుకు కదలించే ప్రయత్నం చేశారు. ఓపెనర్ శుబమన్ గిల్ 37 బంతుల్లో 5 ఫోర్లతో 36 పరుగులు చేయగా, కెప్టెన్ ఇయాన్ మోర్గాన్ 23 బంతుల్లో 3 ఫోర్లు, 1 సిక్సర్‌తో 34 పరుగులు చేశాడు. అలాగే చివర్లో దినేష్ కార్తీక్ 2 ఫోర్లు, 2 సిక్సర్లతో 14 బంతుల్లో 29 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. దీంతో కోల్‌కతా గౌరవ ప్రదమైన స్కోరు చేయగలిగింది.
హైదరాబాద్ బౌలర్లు ఆరంభం నుంచి కోల్‌కతా బ్యాట్స్‌మెన్ ను పరుగులు తీయకుండా అడ్డుకున్నారు. ఈ క్రమంలో వారు ఆ ప్రక్రియలో విజయం సాధించారు. అయినప్పటికీ చివర్లో కోల్‌కతా బ్యాట్స్‌మెన్ స్కోరు బోర్డును పరుగెత్తించారు. ఇక హైదరాబాద్ బౌలర్లలో నటరాజన్ 2 వికెట్లు తీయగా, బెసిల్ థంపి, వి.శంకర్, రషీద్ ఖాన్‌లు తలా 1 వికెట్ తీశారు.