కొమరంభీం జిల్లా సిర్పూర్ కాగజ్ నగర్లో కేంద్ర రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ పర్యటించారు. పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేసిన ఆయన, ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ప్రసంగించారు. ప్రసంగాన్ని అందరికీ నమస్కారం.. బాగున్నారా అంటూ ఆరంభించిన గడ్కరీ, పండిట్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ్ గారి సామాజిక దృక్పథం తమకు ఆదర్శమని అన్నారు. మీ జిల్లాకు రావడం ఆనందంగా ఉంది. ఇక్కడి ప్రజల సమస్యలు నేరుగా వినే అవకాశం దక్కింది అని చెప్పారు.

గడ్చిరోలి జిల్లాలో జరిగిన మార్పులు గుర్తుచేస్తూ, చీకటిలో దీపం వెలిగించాలి అని వ్యాఖ్యానించారు. పేదలకు ఆహారం, నివాసం, వస్త్రం అవసరమని, అందుకు కేంద్రం కృషి చేస్తోందన్నారు. ప్రతి యువకుడికి ఉపాధి లభించాలన్నదే మా లక్ష్యం అని తెలిపారు. వ్యవసాయ శాస్త్రంపై తనకున్న ఆసక్తితో ఇప్పటివరకు 13 డాక్టరేట్ డిగ్రీలు పొందినట్లు తెలిపారు. నీటి నిల్వ సామర్థ్యం పెంచేందుకు డ్యాముల్లో, చెరువుల్లో పూడిక తీయడం జరిగిందని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం నుంచి రూపాయి కూడా ఆశించకుండా మేమే సాయంగా నిలుస్తాం అని తెలిపారు. దీని వల్ల నీటి సమస్యలు తీరడంతో రైతుల ఆత్మహత్యలు తగ్గుతాయని నమ్మకం వ్యక్తం చేశారు.
వాజ్పేయి గారి ఆదేశాలతో 33 ఏళ్ల వయసులో గ్రామాలకు రహదారి కనెక్టివిటీ ప్రారంభించాం. అదే ప్రస్తుత గ్రామ సడక్ యోజన అని గడ్కరీ గుర్తుచేశారు. మంత్రిగా బాధ్యతలు చేపట్టినప్పుడు దేశంలో 2,511 కిలోమీటర్ల హైవేలు ఉండగా, ఇప్పుడు దాదాపు 5,000 కిలోమీటర్లకు పెరిగాయి అన్నారు.
భవిష్యత్తులో తెలంగాణలో 2 లక్షల కోట్ల రూపాయల విలువైన రహదారి పనులు చేపట్టనున్నట్లు ప్రకటించారు. ఇది ట్రైలర్ మాత్రమే, అసలు పిక్చర్ ఇంకా మిగిలి ఉంది అంటూ ప్రజల్లో ఆసక్తి రేపారు. ములుగు, అదిలాబాద్ వంటి ఆదివాసీ జిల్లాలకు జాతీయ రహదారి కనెక్టివిటీ కల్పిస్తామని తెలిపారు. నీరు, విద్యుత్, రవాణా – ఇవన్నీ అభివృద్ధికి మూలస్తంభాలు అన్నారు.
17 వేల కోట్ల వ్యయంతో లక్ష కోట్ల రూపాయల విలువైన గ్రీన్ ఎక్స్ప్రెస్ హైవే పనులు ప్రారంభమయ్యాయని చెప్పారు. తెలంగాణలో ఇప్పటికే 4,500 కోట్లతో గ్రీన్వే పనులు జరుగుతున్నాయని, ఆసియాలోనే అతిపెద్ద టన్నెల్ నిర్మాణం కూడా ముందుకెళ్తోందని వెల్లడించారు.