తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇంచార్జీ మాణిక్ రావు థాక్రేతో కాంగ్రెస్ కీలక నేత, భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి భేటీ అయ్యారు. హైదరాబాద్ ఎమ్మెల్యే క్వార్టర్స్ లోని క్యాంపు కార్యాలయంలో సమావేశమయ్యారు. కాగా, మునుగోడు ఉప ఎన్నిక నుంచి టీ-కాంగ్రెస్ కార్యక్రమాలకు కోమటిరెడ్డి దూరంగా ఉంటున్న విషయం తెలిసిందే. అంతేగాక, సమయం వచ్చినప్పుడల్లా టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిపై విమర్శలు చేస్తూనే ఉన్నారు. ఈ భేటీపై కోమటిరెడ్డితో రేవంత్తో ఉన్న విభేదాలు, సమస్యలపై కీలకంగా చర్చించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
పార్టీలో జరుగుతున్న పరిణామాలపై ఆయన మాణిక్ రావు దృష్టికి తీసుకెళ్లనున్నారు. రెండో రోజు కూడా థాక్రే నాయకులతో సమీక్షలు చేయనున్నారు. పొలిటికల్ అఫైర్స్ కమిటీ సమావేశంలోనూ ఆయన పాల్గొననున్నారు. ఈ నెల 26 నుంచి పీసీసీ చీఫ్ తో పాటు అందరు నేతలు పాదయాత్రలో పాల్గొనాలని ఆయన ఇప్పటికే నేతలను ఆదేశించినట్లు తెలిసింది. క్రమశిక్షణతో మెలగాలని, లైన్ దాట వద్దని ఆయన హెచ్చరించినట్లు సమాచారం.