వైసీపీ ప్రభుత్వంలో తరుచూ నిఘా వైఫల్యం కారణంగానే తప్పిదాలు జరుగుతున్నాయి అని ఓ వాదన వినిపిస్తోంది. గతంలో కొన్ని నిరసనల సమయంలో కూడా నిఘా వైఫల్యం కారణంగానే ఉద్రిక్తతలు నెలకొన్నాయి అని అంటున్నారు ఇంకొందరు. తాజా పరిణామాల నేపథ్యంలో పోలీసులు, అటు నిరసన కారులు మధ్య వాగ్వాదాలు నడుస్తున్నాయి. సోషల్ మీడియాలో పోస్టులు హల్చల్ చేస్తున్నాయి. సహజ న్యాయ సూత్రాలకు అనుగుణంగా ఎవ్వరైనా నడుచుకోవాలి కదా ! అందుకు అమలాపురం నిరసనకారులేమయినా అతీతులా అని పోలీసులు ప్రశ్నిస్తున్నారు.
తమ వైఫల్యాల కారణంగానే ఈ విధంగా జరిగి ఉంటుందని కొందరు డ్యూటీ ఆఫీసర్లు తర్జనభర్జనలు పడుతున్నారు. ఏదేమయినప్పటికీ ఇంత జరిగినా కొంతలో కొంత పోలీసుల సంయమనం కూడా మంచి ఫలితాలనే ఇచ్చింది అన్న వాదన కూడా పబ్లిక్ నుంచి వస్తోంది. కానీ నిఘా విభాగం వైఫల్యాలు ఇప్పటికైనా అధిగమిస్తే.. కోనసీమలో ప్రశాంత వాతావరణం తిరిగి నెలకొనడం ఖాయం.
ప్రశాంతతకు ఆనవాలుగా నిలిచే కోనసీమలో తగువులు రేగుతున్నాయి. గొడవలు రేగుతున్నాయి. ఈ దశలో ఇంటెలిజెన్స్ వైఫల్యాలు కూడా కొట్టొచ్చిన విధంగా కనిపిస్తున్నాయి. వీలున్నంత వరకూ గొడవలను కంట్రోల్ చేయడం ఓ ఎత్తయితే,. అసలు అంతమంది కలెక్టరేట్ ముట్టడికి వస్తున్నారన్న కనీస సమాచారం లేకపోవడం నిఘా వైఫల్యానికి కారణం. అమలాపురం పోలీసులు నిన్నటి వేళ రాళ్ల దాడికి గురయ్యారు. డ్యూటీలో ఉన్న పోలీసులపై దాడులు అన్నవి ఒప్పుకోదగ్గవి కాదు. ఎస్పీ గాయపడ్డారు. ఇంకా ఇంకొందరు కూడా ! శాంతియుతంగా ఏదయినా అభ్యంతరం ఉంటే చెప్పవచ్చు. నిరసనల్లో ప్రజాస్వామిక స్ఫూర్తి దెబ్బతీసే విధంగా ఆందోళన కారులు ప్రవర్తించడం తప్పు !
మరోవైపు ముఖ్యమంత్రి నుంచి కూడా కొన్ని ఆదేశాలు వెళ్లాయి అని, శాంతి భద్రతలు అదుపు తప్పకుండా కృషి చేయాలని సీఎం చెప్పారని తెలుస్తోంది. ఇవాళ కూడా ఆందోళనలు ఉన్న నేపథ్యంలో నల్ల వంతెన దగ్గర ప్రజలు చేరుకుని ఆందోళనలు చేసేందుకు అవకాశాలున్నాయని ఇప్పటికే సోషల్ మీడియా లో కొందరు చెబుతుండడంతో, పోలీసులు అప్రమత్తం అయి ఉన్నారు. ఏలూరు రేంజ్ డీఐజీ ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఘటనకు బాధ్యులయిన వారిని గుర్తించే పనిలో పోలీసు ఉన్నతాధికారులు ఉన్నారు.