ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు కృష్ణా రివర్ మేనేజ్ మెంట్ బోర్డు షాక్ ఇచ్చింది. శ్రీ శైలం ప్రాజెక్టు నీటితో విద్యుదుత్పత్తి చేయవద్దని.. వెంటనే నిలిపివేయాలని కృష్ణా బోర్డు తెలిపింది. అందుకు కోసం తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శలకు కృష్ణా రివర్ బోర్డు లేఖ రాసింది. కాగ శ్రీ శైలం ప్రాజెక్టులో ప్రస్తుతం 809 అడుగుల నీటి మట్టంతో 34 టీఎంసీల నీరు ఉందని తెలిపింది. ఇది జలాశయంలో కనిష్ట నీటి వినియోగ మట్టానికి నికరంగా 5.2 టీఎంసీలు మాత్రమే అందుబాటులో ఉందని లేఖలో కృష్ణా బోర్టు తెలిపింది.
అయితే మే నెలలో తాగు నీటి అవసరాల కోసం తెలంగాణ 3.5 టీఎంసీలు, ఆంధ్ర ప్రదేశ్ 6 టీఎంసీలు కావాలని కోరిన విషయాన్ని గుర్తు చేసింది. అయితే శ్రీ శైలంలో నీరు తక్కువగా ఉండటం వల్ల తెలుగు రాష్ట్రాలు కోరిన నీటిని ఇవ్వడం సాధ్యం కాదని స్పష్టం చేసింది. తాగు నీటి అవసరాల కోసం విజ్ఞప్తులను సవరించి తిరిగి పంపించాలని రెండు రాష్ట్రాలకు సూచించింది.
అలాగే తాగు నీటికి సరిపడ జలాల కోసం తెలంగాణ రాష్ట్రం అధీనంలో ఉన్న నాగార్జున సాగర్ ఎడమ గట్టు విద్యుత్ ఉత్పత్తి కేంద్రం గుండా శ్రీ శైలం ప్రాజెక్టు రివర్స్ పంపిణీ చేయడానికి గల అవకశాలను పరిశీలించాలని కోరింది.