శాంతించిన కృష్ణమ్మ.. వరద ప్రవాహం తగ్గుముఖం

-

పశ్చిమ కనుమల్లో కురిసిన భారీ వర్షాలతో కృష్ణా నదికి లక్షలాది క్యూసెక్కుల వరద నీరు వచ్చింది. గత కొన్ని రోజులుగా కృష్ణా పరివాహక ప్రాంతాలు వరదనీటి ముంపులో ఉన్నాయి. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్‌లో వరద తాకిడికి గ్రామాలు, ప్రజలు ఎక్కువ ఇబ్బంది పడుతున్నారు. అయితే మహారాష్ట్ర,కర్ణాటకల్లో భారీ వర్షాలు తగ్గడంతో వరద ప్రవాహం తగ్గుముఖం పట్టింది. దీంతో రానున్న రెండుమూడు రోజుల్లో అంతా సాధారణ స్థితకి వస్తుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. తెలంగాణ, ఆంధ్రలలోని కృష్ణా జలాశయాల పరిస్థితి పరిశీలిస్తే…

జురాల

ఇక కృష్ణా నది పరిధిలోని జూరాల జలాశయం వద్ద వరద ఉద్ధృతి క్రమంగా తగ్గుతోంది. ఇన్‌ఫ్లో 6లక్షల 32వేల క్యూసెక్కులు. ఔట్ ఫ్లో 6 లక్షల 30వేల క్యూసెక్కులు ఉంది. ప్రస్తుతం 50 గేట్ల ద్వారా వరద నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. జూరాల పూర్తి నిల్వ సామర్థ్యం 9.657 టీఎంసీలు. ప్రస్తుతం 6.749 టీఎంసీల నీటిని నిల్వ ఉంది.

శ్రీశైలం

శ్రీశైలం జలాశయానికి వరద ప్రవాహం స్థిరంగా కొనసాగుతోంది. 10 గేట్ల ద్వారా 6 లక్షల 35 వేల క్యూసెక్కుల నీరు సాగర్‌కు విడుదల చేస్తున్నారు. ఇన్ ఫ్లో 7 లక్షల 55 వేల క్యూసెక్కుల నీరు ఉండగా..ఔట్ ఫ్లో 7 లక్షల 48 వేల క్యూసెక్కుల మేర ఉంది. పూర్తి స్థాయి నీటిమట్టం 885 అడుగులు కాగా.. ప్రస్తుతం 881.50 అడుగుల నీటిమట్టం ఉంది.

ఎడమ గట్టు విద్యుత్ కేంద్రం ద్వారా 38 వేల 140 క్యూసెక్కులు విడుదలవుతుండగా.. కుడిగట్టు విద్యుత్ కేంద్రం ద్వారా 31వేల 349 క్యూసెక్కులు విడుదలవుతోంది. కల్వకుర్తి ఎత్తిపోతల పథకం ద్వారా 1600 క్యూసెక్కులు విడుదల చేయగా.. హంద్రీనీవాకు 2,025 క్యూసెక్కుల నీరు విడుదలయ్యింది. పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటరీ ద్వారా 40 వేల క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు.

నాగార్జునసాగర్

శ్రీశైలం నుంచి నాగార్జునసాగర్‌కు 6 లక్షల 31 వేల క్యూసెక్కుల జలాలు విడుదల చేస్తున్నారు. సాగర్ ఇన్‌ఫ్లో, ఔట్ ఫ్లో 6 లక్షల 80 వేల క్యూసెక్కులుగా నమోదైంది. జలాశయం పూర్తినీటి మట్టం 590 అడుగులు కాగా.. ప్రస్తుతం 586 అడుగులకు చేరింది. ప్రస్తుతం 26 గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. నాగార్జున సాగర్ నుంచి వస్తున్న నీటితో పులిచింతల ప్రాజెక్టు కలకలలాడుతోంది. దీంతో 22 గేట్ల ద్వారా దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు.

ప్రకాశం బ్యారేజీ

సాగర్ నుంచి ప్రకాశం బ్యారేజీకి వచ్చి చేరుతున్న నీరు 6.43 లక్షల క్యూసెక్కులు కాగా.. దిగువకు 7.85 లక్షల క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం ప్రకాశం బ్యారేజీలో 4 టీఎంసీల వరద నీరు ఉంది.
రానున్న రెండు మూడురోజుల్లో వరద ప్రవాహం మరింత తగ్గి జురాల, శ్రీశైలం, సాగర్‌లలో పూర్తిస్థాయి నీటిమట్టాల వద్ద ఉంటాయని జలవనరుల నిపుణులు అంచనావేస్తున్నారు.


కృష్ణా నదికి కేవలం పదిపదిహేను రోజుల్లో వచ్చిన భారీ వరదతో పదేండ్లుగా నిండని జలాశయాలు జలకళతో నిండు కుండలాగా ఉన్నాయి. ఈసారి సాగర్ ఆయకట్టు కింద రెండు పంటలకు, హైదరాబాద్, సాగర్ ఆయకట్టు పరిధిలోని జిల్లాలకు తాగునీటికి సమస్య తీరినట్లేనని సాగర్ ఇంజినీర్లు పేర్కొంటున్నారు.

– కేశవ

Read more RELATED
Recommended to you

Latest news