ఒకే స్టైల్‌లో ప్రభాస్-కృష్ణంరాజు… వీడియో అదిరిందిగా…

సోషల్​మీడియాలో ప్రభాస్​-కృష్ణంరాజుకు సంబంధించిన ఓ వీడియో వైరల్​గా మారింది. ఇందులో ఒకవైపు కృష్ణంరాజు నటించిన చిత్రాలలోని పాత్రలు, మరోవైపు ప్రభాస్‌ నటించిన చిత్రాలలోని సన్నివేశాలను ఒకదానితో ఒకటి కలిసేలా మిక్స్‌ చేసిన విధానం బాగుంది.

ఇటీవలే అనారోగ్యంతో కన్నుమూసిన తన పెద్దనాన్న సీనియర్ నటుడు కృష్ణంరాజును.. పాన్ ఇండియా స్టార్​ ప్రభాస్‌ గుర్తు చేసుకున్నారు. ఈ క్రమంలోనే ప్రభాస్‌ అభిమానులు ఓ వీడియోను క్రియేట్​ చేసి సోషల్​మీడియాలో పోస్ట్ చేశారు. ప్రస్తుతం అది వైరల్‌ అవుతోంది. అందులో ఒకవైపు కృష్ణంరాజు నటించిన చిత్రాలలోని పాత్రలు, మరోవైపు ప్రభాస్‌ నటించిన చిత్రాలలోని సన్నివేశాలను ఒకదానితో ఒకటి కలిసేలా మిక్స్‌ చేశారు. ఆ ప్రతి ఫ్రేమ్‌ అభిమానులను కట్టిపడేస్తోంది. ‘ఎడిటింగ్‌ చాలా బాగుంది’, ‘సేమ్‌ మేనరిజం’ అంటూ అభిమానులు కామెంట్లు పెడుతున్నారు.

కాగా, కృష్ణంరాజు మరణంతో షూటింగ్​లకు కాస్త బ్రేక్ ఇచ్చిన ప్రభాస్‌.. తాజాగా ‘సలార్‌’ చిత్రాన్ని పునఃప్రారంభించారు. ప్రశాంత్‌ నీల్‌ తెరకెక్కిస్తున్న పాన్‌ ఇండియా చిత్రమిది. హోంబలే ఫిల్మ్స్‌ సంస్థ నిర్మిస్తోంది. శ్రుతిహాసన్‌ కథానాయిక. ఈ చిత్ర కొత్త షెడ్యూల్‌ రామోజీ ఫిల్మ్‌ సిటీలో తాజాగా ప్రారంభమైంది. ఈ షెడ్యూల్‌ కోసమే ఇప్పటికే అక్కడ 12 ప్రత్యేక సెట్లు సిద్ధం చేసినట్లు సమాచారం. ఇప్పుడు వీటిలోనే ప్రభాస్‌తో పాటు ఇతర ప్రధాన తారాగణంపై పలు కీలక సన్నివేశాలు చిత్రీకరిస్తున్నట్లు తెలుస్తోంది. విభిన్నమైన యాక్షన్‌ కథాంశంతో రూపొందుతోన్న చిత్రమిది. ఈ చిత్రానికి సంగీతం రవి బసూర్‌ అందిస్తున్నారు.