మంత్రి ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి బ‌డి బాట.. విద్యార్థులతో కలిసి..

సారంగాపూర్ మండ‌లం జాం గ్రామంలోని ప్రభుత్వ సాంఘీక సంక్షేమ బాలికల రెసిడెన్షియల్ స్కూల్, వసతి గృహాలను మంత్రి ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి శ‌నివారం ఆకస్మికంగా తనిఖీలు చేశారు. సాంఘిక సంక్షేమ గురుకులాల్లో సౌకర్యాలు ఎలా ఉన్నాయో తెలుసుకునేందుకు మంత్రి ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి బ‌డి బాట ప‌ట్టారు. రెసిడెన్షియల్ స్కూల్‌‌లో వంట గ‌ది, భోజ‌న శాల‌, వ‌స‌తి ఇలా అన్ని విభాగాలను నిశితంగా పరిశీలించారు మంత్రి ఇంద్ర‌క‌ర‌ణ్. విద్యార్థుల‌కు అందిస్తున్న భోజ‌న వివ‌రాల‌ను, మెనును అడిగి తెలుసుకున్నారు మంత్రి ఇంద్ర‌క‌ర‌ణ్. పిల్లలకు నాణ్యమైన విద్య, భోజనం అందించాలని నిర్వాహకులకు మంత్రి ఇంద్ర‌క‌ర‌ణ్ సూచించారు.

గురుకుల విద్యార్థుల‌తో క‌లిసి భోజ‌నం చేసిన మంత్రి ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి

ఇటీవ‌ల ఆహారం క‌లుషిత‌మై విద్యార్థులు అస్వ‌స్థ‌త‌కు గుర‌వుతున్న ఘ‌ట‌న‌ల నేప‌థ్యంలో వంట గ‌దిలో ప‌రిశుభ్ర‌త‌కు ప్రాధాన్యం ఇవ్వాల‌న్నారు మంత్రి ఇంద్ర‌క‌ర‌ణ్. తాజా కూర‌గాయాలను వండాల‌ని, బియ్యం, గుడ్లు, ఇత‌ర వంట సామాగ్రి ఎక్కువ కాలం నిల్వ ఉంచ‌రాద‌ని ఆదేశించారు. ఈ సందర్భంగా విద్యార్థినిల‌తో ఆయన మాట్లాడారు. అల్పాహారం, భోజనం రుచికరంగా ఉంటోందా? అన్ని వసతులు అందుబాటులో ఉన్నాయా.. అని ఆరా తీశారు. అనంత‌రం విద్యార్థుల‌తో క‌లిసి భోజ‌నం చేశారు మంత్రి ఇంద్ర‌క‌ర‌ణ్.