కృష్ణా జలాల్లో తెలంగాణ వాటా తేల్చాలని రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖమంత్రి కేటీఆర్ కేంద్రాన్ని డిమాండ్ చేశారు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడి ఎనిమిదిన్నరేళ్లు అవుతున్నా నేటికీ కృష్ణా జలాల వాటా తేల్చలేదని మండిపడ్డారు. నారాయణపేట జిల్లా కేంద్రంలో మంత్రులు నిరంజన్‌రెడ్డి, మహమూద్‌అలీతో కలిసి మంగళవారం ఆయన రూ.196 కోట్లతో వివిధ అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేశారు.
అనంతరం పేట మినీ స్టేడియంలో ఏర్పాటు చేసిన ‘ప్రగతి నివేదిన సభ’లో కేటీఆర్ మాట్లాడారు. కృష్ణా జలాల్లో ఏపీ తెలంగాణ వాటా తేల్చేందుకు ట్రైబ్యునల్‌కు ఓ ఉత్తరం రాయడానికి కూడా కేంద్రానికి తీరిక లేదన్నారు. పాలమూరు ఎండాలనే దురాలోచనతో ఉన్నారని దుయ్యబట్టారు.
813 టీఎంసీల కృష్ణా జలాల్లో వాటాతేల్చలేదని, ఈ బేసిన్‌లోనే ఉమ్మడి పాలమూరు, నల్గొండ, రంగారెడ్డి జిల్లాలు, హైదరాబాద్ మహానగరం ఉన్నాయని తెలిపారు. నీళ్ల పంపకాలు చేపట్టకపోయినా ఉమ్మడి పాలమూరులో 11 లక్షల ఎకరాలకు సాగునీరందించిన ఘనత సీఎం కేసీఆర్ ప్రభుత్వానిదేనని చెెప్పారు.