వైద్య పరికరాలపై జీఎస్టీ తగ్గించాలని కోరుతూ కేంద్ర మంత్రి పీయూష్ గోయల్‌కు రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ లేఖ రాశారు. వైద్య పరికరాలపై 12 శాతం, డయాగ్నోస్టిక్స్ పరికరాలపై 18 శాతం విధిస్తున్న జీఎస్‌టీని 5 శాతానికి తగ్గించాలని లేఖలో కోరారు. తెలంగాణ సహా భారత్‌లో వైద్య పరికరాల ఉత్పత్తి సంస్థల అభివృద్ధికి తోడ్పాటు అందించాలని విజ్ఞప్తి చేశారు. పరిశ్రమ ఎదుర్కొంటున్న సమస్యలపై కేంద్రం సానుకూల చర్యలు తీసుకోవాలని లేఖలో పేర్కొన్నారు.
‘ఈ ఏడాది ఫిబ్రవరిలో బయో ఏసియా 20వ వార్షికోత్సవ సదస్సును హైదరాబాద్‌లో నిర్వహించిన సందర్భంగా.. వైద్య పరికరాల ఉత్పత్తి సంస్థల ప్రతినిధులతో ప్రత్యేకంగా సమావేశమయ్యాం. ఇందులో వారు తమ సమస్యలను లేవనెత్తారు. వైద్య పరికరాల పరిశ్రమకు ఉపయోగపడే చర్యలను సూచించారు. ప్రస్తుతం కస్టమ్ డ్యూటీతో పాటు వైద్య పరికరాల విడిభాగాలపై కూడా జీఎస్‌టీని ఎక్కువ రేటుతో వసూలు చేస్తున్నారు. ఫలితంగా భారత్‌లో వైద్య పరికరాల ధరలపై ప్రతికూల ప్రభావం పడుతోంది. ప్రజలకు తక్కువ ధరకే వైద్యం అందించాలనే ప్రభుత్వ లక్ష్యానికి ఇది అడ్డంకిగా మారుతోంది. అందుకే వైద్య పరికరాలపై జీఎస్టీ తగ్గించి.. దేశీయ ఉత్పత్తులను ప్రోత్సహించండి.’ అని కేటీఆర్ తన లేఖలో రాశారు.