వేసవి వచ్చేసింది.. అప్పుడే ఎండలు మండిపోతున్నాయి. మార్చిలోనే మే ను తలపిస్తున్నాడు సూర్యుడు. భానుడి భగభగలతో పగటిపూట ప్రజలు బయటకు రావడానికే జంకుతున్నారు. రానున్న రోజుల్లో ఎండల తీవ్రత పెరగడం, వడగాడ్పులకు అవకాశం ఉన్న నేపథ్యంలో ప్రత్యేక ఏర్పాట్లతో సంసిద్ధంగా ఉండాలని జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారులను రాష్ట్ర ప్రజారోగ్యశాఖ డైరెక్టర్ జి.శ్రీనివాసరావు ఆదేశించారు. జూన్ వరకు ఎండల తీవ్రత కొనసాగితే జులై వరకు ప్రత్యేక చర్యలను కొనసాగించాలని సూచించారు.
‘రాష్ట్రంలోని అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, ఆసుపత్రుల్లో సూచించిన మేరకు ప్రత్యేక ఏర్పాట్లు చేసుకోవాలి. ర్యాపిడ్ రెస్పాన్స్ టీంలు 24 గంటలు పనిచేయాలి. వడదెబ్బకు గురైన బాధితుల వివరాలు, మృతుల వివరాలు సహా ముఖ్యాంశాలపై ప్రతి రోజు సాయంత్రం అయిదు గంటలలోపు నివేదిక పంపాలి. ఓఆర్‌ఎస్ పాకెట్లు, ఐవీ ఫ్లూయిడ్స్, అత్యవసరమైన మందులను అన్ని వైద్య, ఆరోగ్య కేంద్రాల్లో, అంగన్‌వాడీ కేంద్రాల్లో సిద్ధంగా ఉంచుకోవాలి. ప్రజలు పెద్ద సంఖ్యలో చేరేచోట, మురికివాడలు, బలహీనవర్గాల కాలనీల్లో ఓరల్ రీహైడ్రేషన్ థెరపీ (ఓఆర్‌టీ) సెంటర్లు ఏర్పాటు చేయాలి.’ అని డీహెచ్ ఉత్తర్వులు జారీ చేశారు.