ఈ మధ్యకాలంలో జీవన శైలిలో మార్పులు చాలా ఎక్కువగా ఉంటున్నాయి. ముఖ్యంగా ఆహారపు అలవాట్లు మారడం వలన శరీరంలో ఎన్నో అనారోగ్య సమస్యలు వస్తున్నాయి. వాటిలో యూరిక్ యాసిడ్ కు సంబంధించిన సమస్య ఎక్కువ అవుతోంది అని చెప్పవచ్చు. ఈ సమస్య ఎక్కువ అవ్వడం వలన ఎన్నో ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తుంది. యూరిక్ యాసిడ్ సమస్య ఎక్కువ అవ్వడానికి ప్యూరిన్ అధికంగా ఉండే ఆహారాలను తీసుకోవడమే కారణం. పాలకూర, పుట్టగొడుగులు, రాజ్మా, చిక్కుడుకాయలు, షెల్ ఫిష్ మరియు రెడ్ మీట్ వంటి వాటిలో ప్యూరిన్ ఎక్కువగా ఉంటుంది. కనుక, వీటిని తక్కువ మోతాదులో తీసుకోవాలి.
అంతేకాకుండా ఆల్కహాల్, బీర్ వంటి వాటిని ఎక్కువగా తీసుకుంటే యూరిక్ యాసిడ్ స్థాయిలు పెరుగుతాయి. కార్బోనేటెడ్ డ్రింక్స్ లో ఉండే ప్రక్టోజ్ అనేక అనారోగ్య సమస్యలకు దారితీస్తుంది. ప్రక్టోజ్ ఎక్కువగా ఉండే జ్యూస్ లు మరియు ఇతర పానీయాలు యూరిక్ యాసిడ్ ను పెంచుతాయి. ఈ ప్రభావం కిడ్నీల ఆరోగ్యం పై కూడా కనిపిస్తుంది. అయితే యూరిక్ యాసిడ్ ను తగ్గించుకోవడానికి ఎన్నో మార్గాలు ఉన్నాయి. ఖచ్చితంగా ప్రతి రోజు మూడు నుండి నాలుగు లీటర్ల వరకు నీరు తాగాలి. ఇలా చేయడం వలన యూరిక్ యాసిడ్ మూత్రం నుండి బయటకు వెళ్లడానికి సహాయపడుతుంది.
నిమ్మకాయ నీరు కూడా యూరిక్ యాసిడ్ ను కరిగించడానికి సహాయం చేస్తుంది. అలాగే కొత్తిమీర కషాయం తీసుకోవడం వలన శరీరానికి యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు అందుతాయి. ప్యూరిన్ తక్కువగా ఉండే క్యారెట్, బీట్రూట్ మరియు ఇతర కూరగాయలను తీసుకోవాలి. అలాగే చెర్రీలు, స్ట్రాబెర్రీలు, పైనాపిల్, ఆపిల్ వంటి పండ్లను తీసుకోవడం వలన మరింత ప్రయోజనం ఉంటుంది. దాల్చిన చెక్కలో ఉండే ఆంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు కూడా ఈ సమస్యను తగ్గించడానికి సహాయపడతాయి. ఆహారంలో మార్పులు చేసుకోవడంతో పాటు, రోజుకు 30 నిమిషాల పాటు వ్యాయామం, వాకింగ్ లేదా యోగా చేయాలి.