ఈరోజు విజయవాడలో ఓటు హక్కు వినియోగించుకున్న మాజీ ఎంపీ లగడపాటి అనంతరం మీడియాతో మాట్లాడారు. పోటీ వల్లే సంక్షేమానికి పార్టీలు పెద్ద పీట వేస్తున్నాయని అన్నారు. అభివృద్ధి, సంక్షేమంపై సమతుల్యం పాటించాలన్న ఆయన వైఎస్ హయాంలో సంక్షేమం, అభివృద్ధి సమంగా ఉండేవని అన్నారు. ప్రభుత్వాలు తమ అవసరాల మేరకు సంక్షేమం, అభివృద్ధిలో దేనికి ఎక్కువ కేటాయించాలో నిర్ణయం తీసుకుంటాయని ఆయన అన్నారు.
ఇక గెలిచినా ఓడినా పవన్ ప్రజలను అంటి పెట్టుకుని ఉండటం అభినందనీయం అని, సార్వత్రిక ఎన్నికల్లో ఓడినా పవన్ స్థానిక ఎన్నికల్లో పోటీకి దిగారని అన్నారు. ఇక రాజకీయాలకు ముందు నుంచి జగన్ తో స్నేహం ఉందన్న ఆయన సీఎం అవ్వాలన్న జగన్ ఆకాంక్ష నెరవేరిందని అన్నారు. మరో మూడేళ్ల పాలన తర్వాత పాలన ఎలా ఉందో తెలుస్తుందని అన్నారు. రాజకీయ పార్టీల మధ్య పోటీ కారణంగానే విమర్శలు ఘాటుగా ఉంటున్నాయని పేర్కొన్న ఆయన ఓటు ద్వారానే కోరుకున్న పాలకులు వస్తారని అన్నారు.