ఎస్సీ వర్గీకరణకు తాము అనుకూలం అంటూనే సీఎం రేవంత్ రెడ్డి మాలల సూచనలు పక్కాగా అమలు చేస్తున్నారని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ ఆరోపించారు. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఎస్సీ వర్గీకరణ ప్రక్రియ పూర్తి కాకముందే ఉద్యోగాలన్నీ మాలలకు కట్టబెట్టే పనిలో సీఎం నిమగ్నమయ్యారని బాంబు పేల్చారు. అసెంబ్లీ సాక్షిగా ఇచ్చిన మాట నిలబెట్టుకోలేకపోతే.. సీఎం పదవికి రేవంత్ రెడ్డి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. రేపటి నుంచి జిల్లాల్లోని వర్సిటీల్లో నిరవధిక దీక్షలకు దిగుతామని అన్నారు. ఎస్సీ వర్గీకరణ చట్టం అమల్లోకి వచ్చాకే రాష్ట్రంలో ఉద్యోగాలను భార్తీ చేయాలని మంద కృష్ణ మాదిగ డిమాండ్ చేశారు.
సీఎం రేవంత్ రెడ్డి శనివారం ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ బహిరంగ లేఖ రాశారు. ఎస్సీ వర్గీకరణ పూర్తి అయ్యేంత వరకు రాష్ట్రంలో అన్ని రకాల ఉద్యోగ నియామక పరీక్షల ఫలితాలను నిలిపివేయాలని ఆ లేఖలో పేర్కొన్నారు. ఈనెల 12 నుంచి జరిగే అసెంబ్లీ సమావేశాల్లో ఎస్సీ వర్గీకరణ కోసం చట్టం చేస్తామని ప్రభుత్వం చెప్పిందని గుర్తు చేశారు. అంతలోనే గ్రూప్స్ ఫలితాల వెల్లడి తేదీలను ప్రకటించడం సరైంది కాదని ఆక్షేపించారు.