ప్రేమతో ఆత్మీయుల మనసుల్లోకి ఒదిగిపోయి నప్పుడు మనల్ని మనం మైమరిచిపోతాం. కేవలం మనుషుల్నే కాదు మనలోని సున్నితత్వాన్ని తట్టిలేపే మొక్కల్నీ, ప్రేమతో పంచనచేరే జంతువుల్నీ అన్నింటినీ ప్రేమిస్తాం. అవును నిజ్జంగా మనకు విశ్వజనీయమైన ప్రేమను అందించే, ప్రేమని ఆస్వాదించే గొప్ప మనసు ఉంది.అంత గొప్ప మనసు ఉండీ ఆ మనసు ఎప్పుడూ ఒంటరిదే! అందర్నీ అక్కున చేర్చుకుంటాం కానీ మనకి మనం ఎప్పుడూ మిగలం. ఈ ప్రపంచంలో అత్యంత అదృష్టవంతులు ఎవరైనా ఉన్నారూ అంటే తమనితాము ప్రేమించుకునేవారే! నిరంతరం ఇతరుల సంతోషంలో మనం ఆనందాన్ని వెదుక్కుంటాం.
వారి మొహంలో ఆశించిన భావం ప్రతిఫలించకపోయినా, వారి మాటల్లో మనం కోరుకున్న భావోద్వేగం ఉట్టిపడకపోయినా మన మనసు నీరుకారిపోతుంది. తల్లి, బిడ్డ, భార్యా, భర్తా, సహోదరులు.. ఇలా మనం ఎవరైతే మన వాళ్లు అనుకుంటామో వారి ప్రతీ కదలికలోనూ అంతరార్థాన్ని ఒడిసిపట్టి విశ్లేషించి మనం అనుకున్న ఫలితం వస్తే సంతృప్తితో కడుపు నింపుకుంటాం.ఇలా ఆత్మీయుల కళ్లల్లో మెరుపుల కోసం కళ్లు కాయలు కాచేలా ఎదురుచూసి చివరకు మనం సాధించేది ఏమిటీ అంటే నిస్పృహ. ఇంతగా ప్రపంచాన్ని ప్రేమించే మనం, ఇంతగా ఎదుటి వ్యక్తి శ్రేయస్కుని కోరుకునే మనం ఒక్కసారి కాకపోతే ఒక్కసారైనా మన కోసం మన ఆనందం కోసం ఒంటరిగా గడుపుతామా? చుట్టూ మనుషులు లేకపోతే జీవితాన్ని కోల్పోయిన భావన కలుగుతుంది.