‘కాంతార’తో దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన కన్నడ హీరో రిషభ్ శెట్టి. ‘హీరో’, ‘బెల్ బాటమ్’ చిత్రాలతో నటుడిగా కన్నడ పరిశ్రమలో గుర్తింపు తెచ్చుకున్న ఆయన ‘కాంతార’తో అదిరిపోయే విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నారు.
అయితే, ఈ చిత్రాన్ని తొలుత కన్నడ అగ్ర కథానాయకుడు, దివంగత నటుడు పునీత్ రాజ్‌కుమార్‌తో చేయాలనుకున్నారట రిషభ్. ఇదే విషయాన్ని తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ఆయన చెప్పారు.
“కాంతారను పునీత్ రాజ్‌కుమార్‌తో చేయాలనుకున్నా. ఓసారి ఆయన్ని కలిసి కథ కూడా చెప్పా. ఆయనకు బాగా నచ్చింది. తప్పకుండా సినిమా చేయాలనుకున్నారు. కాకపోతే, ఆ సమయంలో ఆయన వరుస సినిమాల్లో నటిస్తున్నారు. దానివల్ల డేట్స్ సర్దుబాటు కాలేదు. ఓసారి పునీత్ నాకు ఫోన్ చేసి.. ‘కాంతార కథ చాలా బాగుంది. అందులో నటించడానికి వీలు పడటం లేదు. ఒకవేళ నువ్వు వెయిట్ చేసినా.. ఈ ఏడాది వీలుకాకపోవచ్చు. కాబట్టి, నువ్వే ఈ సినిమాలో నటించు’ ” అని చెప్పారని రిషభ్ వివరించారు.
దాదాపు రూ.15 కోట్ల బడ్జెట్తో నిర్మించిన ఈ సినిమా ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా రూ.250 కోట్లకు పైగా వసూళ్లు అందుకున్నట్లు తెలసింది. కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ కూడా బుధవారం ఈ చిత్రాన్ని వీక్షించారు. తుళునాడు సంస్కృతి, సాంప్రదాయాలను గొప్పగా ఆవిష్కరించారంటూ చిత్రబృందాన్ని ఆమె మెచ్చుకున్నారు.