తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు పదో రోజు కొనసాగుతున్నాయి. ఇవాళ్టి సమావేశాల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ ఆన్‌లైన్ బెట్టింగ్‌పై సంచలన ప్రకటన చేశారు. గేమింగ్, రమ్మీ కేసులు, చర్యలపై కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. వీటి కోసం ప్రత్యేక దర్యాప్తు బృందం ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్లు వెల్లడించారు. ఆన్‌లైన్ బెట్టింగ్‌పై సిట్ ఏర్పాటు చేస్తున్నట్టు అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఆన్‌లైన్ బెట్టింగ్ అనేది అంతర్జాతీయస్థాయి నేరంగా మారిందని ఆయన అన్నారు.
ఆన్‌లైన్ బెట్టింగ్ పట్ల ప్రభుత్వం అప్రమత్తంగా ఉండాలని నిర్ణయించిందని ముఖ్యమంత్రి తెలిపారు. ఆన్‌లైన్ బెట్టింగ్, రమ్మీ పట్ల కఠినంగా ఉండాలని నిర్ణయించామని.. వీటిని నిరోధించడానికి, నిషేధించడానికి సిట్ ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ఆన్‌లైన్ బెట్టింగ్, రమ్మీ నేరాలకు శిక్షలను కూడా సవరించుకోవాల్సి ఉందని అభిప్రాయపడ్డారు. వీటికి ప్రచారం కల్పించినవారిని విచారించామని.. అయితే సమస్య అంతటితో పరిష్కారం కాదని పేర్కొన్నారు. ఆన్‌లైన్ బెట్టింగ్, నేరాల్లో ఏ రకంగా భాగస్వామ్యం ఉన్నా చర్యలు తప్పవని హెచ్చరించారు.