ఏపీలోని ఏలూరు జిల్లాలో చిరుతపులి సంచారం ప్రజలను తీవ్ర భయాందోళనకు గురిచేస్తోంది. తూర్పుగోదావరి జిల్లా కడియం,రాజానగరం ప్రాంతాల్లో కొంతకాలంగా సంచరించిన అదే చిరుత.. ఇప్పుడు ఏలూరు జిల్లా ద్వారకా తిరుమల, భీమడోలు మండలాల్లో సంచరించి ప్రస్తుతం పెదవేగి మండలం వంగూరు, జగన్నాథపురం ప్రాంతాలకు చేరుకున్నట్లు అధికారులు గుర్తించారు. ఆ చిరుతను పట్టుకునేందుకు అటవీ శాఖ అధికారులు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు.
ట్రాప్ కెమెరాలను చిరుత సంచరించే ప్రాంతాల్లో అమర్చేందుకు అధికారులు రంగంలోకి దిగారు.తాజాగా జిల్లాలోని చింతలపూడి వైపు నుంచి ద్వారకాతిరుమల మండలం నేషనల్ హైవే మీదుగా ఎం నాగులపల్లి గ్రామానికి చేరుకున్నట్లు తెలుస్తోంది.ఆ తర్వాత భీమడోలు జంక్షన్‌లో సంచరిస్తూ ట్రాప్ కెమెరాలకు చిక్కింది. పెదవేగి మండలం జగన్నాధపురం,వంగూరు ప్రాంతాల్లో చిరుత ఆచూకీ దొరికింది. పోలవరం కుడి కాలువ గట్టు మీద తిరుగుతూ అన్ని గ్రామాల్లో సంచరిస్తోందని, అక్కడ దాని పాదముద్రలను గుర్తించినట్లు అధికారులు తెలిపారు. ఈ విషయం తెలియడంతో స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు.