ఇన్నాళ్లకు రాజధాని ఊసు ఒకటి కేంద్రం చెప్పింది. రాజ్యసభలో జీవీఎల్ అడిగిన ప్రశ్నకు కేంద్ర హోం మంత్రిత్వ శాఖ సమాధానం చెప్పింది. దీంతో పత్రికలు ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ అనుకూల పత్రికలు ఆ వార్తను మంచిగానే ఇచ్చాయి. అయినా ఆ రోజు రాజధాని అమరావతి అని ఫిక్స్ చేసినప్పుడు చంద్రబాబుతో కయ్యానికి జగన్ దిగలేదు.
పోనీ నష్టపోయిన రైతుల తరఫున కూడా మాట్లాడ లేదు. ఇప్పుడు మాత్రం చంద్రబాబు సేకరించిన భూములకే జగన్ మోహన్ రెడ్డి అప్పులు తెస్తున్నారు. ఆ అప్పులు కూడా భూమి తనఖా కింద తీసుకువచ్చిన లేదా రావాలనుకుంటున్న అప్పులు. అప్పులు కావాలంటే రాజధాని భూములు కావాలి. కానీ అదే సమయంలో అక్కడున్న రైతుల సమస్యలు పరిష్కరించమంటే పరిష్కరించరు.
వాస్తవానికి ఆంధ్రుల రాజధాని అమరావతి అని ప్రకటించినప్పుడు చాలా అంటే చాలా స్పందన వచ్చింది. మిగతా ప్రాంతాలలో కూడా అనుకూల సంకేతాలే వచ్చాయి. ముందు అనుకున్న దొనకొండ (ప్రకాశం జిల్లా) కాదనుకుని, చంద్రబాబు గుంటూరు సమీప ప్రాంతాలను కొన్నింటిని కలుపుకుని రాజధాని అమరావతిగా అనౌన్స్ చేశారు. మొత్తం 19 గ్రామాల నుంచి భూ సేకరణ చేశారు. అటుపై కొన్ని నిర్మాణాలను కూడా చేపట్టారు.
ముఖ్యంగా విజయవాడ నగరానికి రాజధానిని అనుసంధానిస్తూ రోడ్లు వేయాలని కూడా సంకల్పించారు. కొన్ని ప్రతిపాదనలు పనులు కూడా చేపట్టారు. కానీ జగన్ అధికారంలోకి వచ్చాక అవన్నీ ఆగిపోయాయి. ఆయన దేనికీ ఒప్పుకోవడం లేదు. రివర్స్ టెండరింగ్ పేరిట కొంత డ్రామా నడిపారు. దీనివల్ల కూడా జగన్ ప్రభుత్వం సాధించిందేమీ లేదు. తరువాత 3 రాజధానుల డ్రామా నడిపారు. అది కూడా పూర్తిగా నడపలేక మధ్యలోనే వదిలేశారు.
ఈ దశలో 3 రాజధానుల బిల్లును జగన్ వెనక్కు తీసుకున్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా దీనిపై చర్చ జరిగింది. పరిపాలన రాజధానిగా విశాఖ అంటూ హడావుడి చేయడం తప్ప చేసిందేం లేదని కూడా తేలిపోయింది. ఇక మిగతా ప్రాంతాల అభివృద్ధికి చర్యలు తీసుకోవడం లేదు అని కూడా శాస్త్రీయం గా తేలిన నిజం. వీటిపై కూడా ముఖ్యమంత్రి పెద్దగా మాట్లాడేందుకు ఇష్టపడడం లేదు. ఆయన తన ధోరణిలో తాను ఉంటున్నారు. ఇప్పుడు ఆంధ్రుల రాజధాని అమరావతే అని తేల్చింది కేంద్రం. దీనిని జగన్ ఒప్పుకోరు కానీ ప్రస్తుతం అయితే నోరు మెదపడం లేదు వైసీపీ.