భారత్‌లో కరోనా చికిత్సకు ఉపయోగిస్తున్న మెడిసిన్ల వివరాలు.. పూర్తి జాబితా..!

-

ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్‌కు మెడిసిన్‌ను కనుగొనేందుకు ఇప్పటికీ ప్రయత్నాలు జరుగుతూనే ఉన్నాయి. ఇప్పటికే పలు భారతీయ కంపెనీలు కోవిడ్‌ 19 పేషెంట్లకు చికిత్స అందించేందుకు పలు మందులను తయారు చేసి అమ్మడం మొదలు పెట్టాయి. ఈ క్రమంలోనే దేశంలో ప్రస్తుతం పలు మెడిసిన్లు కరోనా చికిత్సకు అందుబాటులో ఉన్నాయి. అయితే వాటి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.

1. రెమ్‌డెసివిర్‌ (Remdesivir)

అమెరికాకు చెందిన గిలియాడ్‌ సైన్సెస్‌ తొలుత దీన్ని అభివృద్ధి చేసింది. ఇది ఒక యాంటీ వైరల్‌ డ్రగ్‌. దీన్ని గతంలో ఎబోలా చికిత్సకు ఉపయోగించారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ దీన్ని కోవిడ్‌ 19 ఎమర్జెన్సీ పేషెంట్లకు వాడవచ్చని సూచించింది. అలాగే మే 1వ తేదీన యునైటెడ్‌ స్టేట్స్‌ ఫుడ్‌ అండ్‌ డ్రగ్‌ అడ్మినిస్ట్రేషన్‌ (USFDA) కూడా ఈ మెడిసిన్‌ ఉపయోగానికి ఆమోద ముద్ర వేసింది. దీన్ని మన దేశంలోనూ ప్రస్తుతం కోవిడ్‌ మధ్యస్థ లక్షణాలు ఉన్నవారు, ఎమర్జెన్సీ పేషెంట్ల చికిత్స కోసం వాడుతున్నారు. హెటిరో గ్రూప్‌ ఈ మెడిసిన్‌ను కోవిఫోర్‌ (Covifor) పేరిట ఇంజెక్షన్‌ రూపంలో అందుబాటులోకి తెచ్చింది. ఒక్కో ఇంజెక్షన్‌ 100 మిల్లీగ్రాముల డోసులో ఉంటుంది. ఒక్క డోసు ధర రూ.5వేల నుంచి రూ.6వేల మధ్య ఉంది. ఇక రెమ్‌డెసివిర్‌కు చెందిన జనరిక్‌ వెర్షన్‌ను సిప్లా లిమిటెడ్‌ అందుబాటులోకి తెచ్చింది. దీన్ని సిప్రెమి (Cipremi) పేరిట విక్రయించనున్నారు. ఈ మెడిసిన్‌ కూడా కోవిడ్‌ మధ్యస్థ, ఎమర్జెన్సీ దశలో ఉన్న పేషెంట్లకు ఉపయోగపడుతుంది.

2. ఫావిపిరవిర్‌ (Favipiravir)

జపాన్‌కు చెందిన ఫ్యుజిఫిలిం టోయామా కెమికల్‌ లిమిటెడ్‌ తొలుత దీన్ని తయారు చేసింది. ఇది ఒక యాంటీ ఇన్‌ఫ్లుయెంజా డ్రగ్‌. ఈ మెడిసిన్‌ శరీరంలో వైరస్‌ కణాలు వృద్ధి చెందకుండా చూస్తుంది. కోవిడ్‌ 19 క్లినికల్‌ ట్రయల్స్‌లో ఈ మెడిసిన్‌ 88 శాతం వరకు సత్ఫలితాలను ఇచ్చింది. స్వల్ప, మధ్యస్థ లక్షణాలు ఉన్న కోవిడ్ పేషెంట్ల చికిత్సకు ఈ మెడిసిన్‌ను వాడుతున్నారు. భారత్‌లో గ్లెన్‌మార్క్‌ ఫార్మాసూటికల్స్‌ ఈ మందును ఫాబిఫ్లూ (FabiFlu) పేరిట విక్రయిస్తోంది. ఒక్కో ఫాబిఫ్లూ ట్యాబ్లెట్‌ను రూ.103కు విక్రయిస్తున్నారు.

3. డెక్సామిథసోన్‌ (Dexamethasone)

శరీరంలో వాపులను తగ్గించే స్టెరాయిడ్‌ డ్రగ్‌ ఇది. ఎన్నో దశాబ్దాలుగా దీన్ని స్టెరాయిడ్‌గా వాడుతున్నారు. ఇది రుమాటిజం, ఆస్తమా, అలర్జీలు తదితర అనేక వ్యాధుల చికిత్సకు ఉపయోగపడుతుంది. అలాగే కోవిడ్‌ 19 పేషెంట్లు మృతి చెందే అవకాశాలను ఈ మెడిసిన్‌ తగ్గిస్తుంది. వారి శరీరంలో రోగ నిరోధక వ్యవస్థ కోవిడ్‌పై మరింత మెరుగ్గా పోరాడేందుకు ఈ మెడిసిన్‌ ఉపయోగపడతుంది. దీన్ని వెంటిలేటర్‌పై చికిత్స పొందుతున్న కోవిడ్‌ 19 పేషెంట్లకు ఇస్తున్నారు. యూకేలో ఈ డ్రగ్‌ను కోవిడ్‌ పేషెంట్లకు వాడేందుకు ముందుగా అనుమతి ఇచ్చారు. ఈ స్టెరాయిడ్‌ చాలా తక్కువ ధరకే లభిస్తుంది. భారత్‌లో దీని ఇంజెక్షన్‌ ఖరీదు రూ.10 కన్నా తక్కువగానే ఉంది.

4. హైడ్రాక్సీక్లోరోక్విన్‌ (Hydroxychloroquine)

భారత్‌లో దీన్ని మలేరియా చికిత్సకు వాడుతున్నారు. ఇది యాంటీ రుమాటిక్‌ డ్రగ్‌గా కూడా పనిచేస్తుంది. ఆర్థరైటిస్‌ ఉన్నవారిలో వాపులు, నొప్పులను తగ్గిస్తుంది. ఈ డ్రగ్‌ కోవిడ్‌ ఇన్‌ఫెక్షన్‌ వ్యాపించకుండా చూస్తుందని తేలింది. దీంతో HCQ (Hydroxychloroquine)ను కోవిడ్‌ చికిత్సకు కూడా ఉపయోగిస్తున్నారు. ప్రస్తుతం దేశంలో 12 ఫార్మా కంపెనీలు ఈ మెడిసిన్‌ను తయారు చేస్తున్నాయి. ఈ మెడిసిన్‌ ఒక్క ట్యాబ్లెట్‌ ఖరీదు రూ.3గా ఉంది.

5. ప్లాస్మా థెరపీ

కరోనా నుంచి పూర్తిగా కోలుకున్న వ్యక్తి రక్తాన్ని సేకరించి.. అందులోని ప్లాస్మాను వేరు చేసి దాన్ని కరోనా ఎమర్జెన్సీ పేషెంట్లకు ఎక్కిస్తారు. దీంతో వారు ప్రాణాపాయం నుంచి బయట పడవచ్చు. ప్రస్తుతం దేశంలోని పలు రాష్ట్రాల్లో కోవిడ్‌ ఎమర్జెన్సీ పేషెంట్లకు ఈ విధంగా ప్లాస్మా థెరపీ ద్వారా చికిత్సను అందిస్తున్నారు.

ఇక తాజాగా పతంజలి ఆయుర్వేద కరోనైల్‌ పేరిట కోవిడ్‌ 19 ఆయుర్వేద మెడిసిన్‌ను ఆవిష్కరించింది. అశ్వగంధతోపాటు పలు మూలికలు కలిపి ఈ మెడిసిన్‌ను తయారు చేసినట్లు ఆ సంస్థ తెలిపింది. దీన్ని వాడడం వల్ల క్లినికల్‌ ట్రయల్స్‌లో 3 నుంచి 7 రోజుల్లోనే కరోనా పూర్తిగా నయమైందని బాబా రాందేవ్‌ తెలిపారు. కానీ ఈ మెడిసిన్‌ విడుదల చేశాక పతంజలి సంస్థ వివాదాల్లో ఇరుక్కుంది. మరి ఆ వివాదాలను వారు పరిష్కరించుకుని కరోనైల్‌ మెడిసిన్‌ను మళ్లీ మార్కెట్‌లో విడుదల చేస్తారో, లేదో చూడాలి.

Read more RELATED
Recommended to you

Exit mobile version