వైకాపాలో జగన్ తర్వాత ఎవరు? టక్కున చెప్పే పేరు.. విజయసాయిరెడ్డి అని! కానీ… విశాఖ ఎల్జీపాలిమర్స్ బాధితులను పరామర్శించడానికి జగన్ వెళ్లిన సమయంలో.. ప్రోటోకాల్ లో భాగంగా విజయసాయిని కారులోనుంచి దింపేసిన జగన్.. ఆళ్ల నానినీ ఎక్కించుకున్నారు. ఇది ప్రోటోకాల్ పరిస్థితే తప్ప మరొకటి కాదని సాయిరెడ్డి ఎంత మొతుకున్నా.. ఒక వర్గం మీడియా ఆ అంశాన్ని “జగన్ కు సాయిరెడ్డికి చెడింది” అన్న కథనాలను ఇబ్బడి ముబ్బడిగా ఇచ్చేసింది! ఈ క్రమంలో వారి మధ్య నిజంగానే గ్యాప్ వచ్చిందా.. అదంతా మీడియా సృష్టేనా అన్న అంశానికి సంబందించి ఒక పరీక్ష ముందుకు వచ్చింది!
జగన్ – విజయసాయిరెడ్డి మధ్య బంధం ఏమాత్రం చెడిపోలేదని… ప్రస్తుతం వస్తోన్న కథనాలు అన్నీ పార్టీ విధాన్నాల్లోనూ, పరిస్థితుల ప్రభావాల్లోనూ భాగాలే తప్ప.. సాయిరెడ్డికి చెక్క్ పెట్టే సంఘటనలు కాదని తెలియజెప్పే సంఘటన… లేదా ఆ అంశంపై క్లారిటీ తెచ్చే సంఘటన ఒకటి రెడీ గా ఉంది. అదే… వైకాపాలోకి గంటా ఎంట్రీ!!
ప్రస్తుతం ఉత్తరాంధ్రకు సంబంధించిన పార్టీ వ్యవహారాలన్నీ సాయిరెడ్డి చూస్తున్నారన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో గంటా శ్రీనివాస్ ని వైకాపాలోకి ఆహ్వానిస్తున్నారనే టాక్ అత్యంత బలంగా మొదలైపోయింది. కానీ… విజయసాయికి ఇది ఏమాత్రం ఇష్టం లేని అంశం అని.. ఇదే క్రమంలో విశాఖ నుంచి మంత్రిగా ఉన్న అవంతి శ్రీనివాస్ కు కూడా ఏమాత్రం ఇష్టం లేదని అంటున్నారు!!
అదే నిజమైతే… విజయసాయిరెడ్డికి కాదని గంటాను పార్టీలో చేర్చుకునే ఆలోచన జగన్ చేస్తారా? చేయారా? అన్నది ఇప్పుడు పెద్ద ప్రశ్న! ప్రస్తుతం టీడీపీ అనుకూల మీడియా కథనాలు చూస్తుంటే… గంటా టీడీపీని వీడుతున్నారు అన్నట్లుగానే ఉన్నాయి. దీంతో… విజయసాయి – జగన్ ల మధ్య బంధం అప్పట్లానే ఉందా? లేక, బంధానికి బీటలు వారాయా అన్నది తెలియాలంటే… గంటా వైకాపాలో చేరడం చేరకపోవడంపై ఆధారపడి ఉంటుంది! సో… ఈ లిట్మస్ టెస్ట్ రాబోయే రోజుల్లో వైకాపాలో చాలా కీలమైన పరీక్ష కాబోతుందనడంలో ఎవరికీ సందేహం ఉండకపోవచ్చు!!