మంటగలిసిన మానవత్వం.. సూసైడ్ చిత్రాలను ఫోన్‌లో రికార్డు చేస్తూ పైశాచిక ఆనందం

-

మానవత్వం మంటకలిసిపోతోంది. ఎదురుగా మనిషి చనిపోతున్నా.. ఆ చిత్రాలను సెల్‌ఫోన్‌లో రికార్డు చేస్తున్నారు కానీ వారిని కాపాడాలనే ఆలోచన చాలా మందికి రావడం లేదు. ఇలాంటి ఘటనే కర్ణాటకలోని హొసపేటె తాలూకా మరియమ్మన హళ్లి పట్టణ సమీపంలోని హనుమన హళ్లివద్ద చోటు చేసుకుంది.

హనుమన హళ్లికి చెందిన మంజునాథ్‌ అనే యువకుడికి మూర్ఛ ఉండేది. ఎక్కడ చూపించినా నయం కాలేదు. దీంతో ఇంటికి బరువెందుకని భావించి ఆత్మహత్య శరణ్యమని జీవితంపై విరక్తితో అర్ధరాత్రిపూట బయటకు వచ్చాడు. ప్రధాన రహదారిపైకి రాగానే అక్కడ జాతీయ రహదారి వంతెన కనిపించింది. పక్కనే ఓ స్తంభం కూడా ఉంది. కట్టుకున్న పంచెను తీసి దాన్నే ఉరితాడుగా చేసుకున్నాడు. స్తంభం ఎక్కి, పంచె ఓ అంచును స్తంభానికి కట్టి, మరో అంచును ఉరిగా మార్చుకుని బిగించుకున్నాడు.

అతను స్తంభం ఎక్కినప్పటి నుంచి ఉరి వేసుకుని ప్రాణాలొదిలే వరకు ఆ మార్గంలో రాకపోకలు చేసిన చాలా మంది ఆ దృశ్యాలను వీడియో, ఫొటో తీశారుగాని అతన్ని ఎవరూ అడ్డుకోలేదు. అందరూ చూస్తుండగానే ఉరేసుకుని తనువు చాలించాడు. ఈ దృశ్యాలు వీడియో, ఫొటో తీసినవారు సామాజిక మాధ్యమాల్లో పెట్టి పైశాచిక ఆనందం పొందారు. ఈ దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ కాగానే, చాలా మంది వీడియో తీసినవారిపై మండి పడుతున్నారు. మానవత్వం లేని మనుషులుగా దుమ్మెత్తి పోస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version